Share News

Harish Rao: మంత్రి ఉత్తమ్‌‌కు హరీష్ రావు సంచలన లేఖ

ABN , Publish Date - Aug 13 , 2025 | 01:57 PM

తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు బుధవారం లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలని హరీష్‌రావు లేఖలో పేర్కొన్నారు.

Harish Rao: మంత్రి ఉత్తమ్‌‌కు హరీష్ రావు సంచలన లేఖ
Harish Rao

సిద్దిపేట జిల్లా, ఆగస్టు13(ఆంధ్రజ్యోతి): తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి (Minister Uttam Kumar Reddy) మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (Harish Rao) ఇవాళ (బుధవారం) లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలని లేఖలో పేర్కొన్నారు హరీష్‌రావు. రిజర్వాయర్‌లలో నీటిని సకాలంలో నింపకపోవడం వల్ల రైతులు ఆందోళనలో ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లను వెంటనే నింపాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజ్-6 వద్ద మోటార్లను ఆన్ చేసి నీటి పంపింగ్ చేయాలని కోరారు హరీష్‌రావు.


అగ్రికల్చర్ అధికారులపై హరీష్‌రావు సీరియస్...

మరోవైపు.. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామం వద్ద ఎరువుల కోసం క్యూలో బారులు దీరిన రైతులను చూసి హరీష్‌రావు ఆగిపోయారు. కేసీఆర్ హయాంలో హమాలీ ఖర్చులు ఇచ్చి ఇంటికి యూరియా పంపించామని గుర్తు చేశారు. ఉదయం నుంచి రైతులు వచ్చి ఇబ్బందులు పడుతుంటే పట్టించుకొనే అధికారి లేరని అగ్రికల్చర్ అధికారులపై సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. పదేళ్లలో లేని కొరత.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎరువుల కొరత మూమ్మాటికీ ఈ బీజేపీ , కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యమేనని విమర్శించారు. పదేళ్లలో కేసీఆర్ హయాంలో ఎరువుల ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు. ప్రతి మండలానికి గోదాంలు ఏర్పాటు చేసుకొని, వేసవి కాలంలోనే ఎరువులు స్టాక్ పెట్టామని గుర్తుచేశారు. ఏ గ్రామంలో ఎరువులు ఆ గ్రామంలోనే రైతులకు అందించామని వెల్లడించారు. గ్రామం నుంచి రైతు కాలు బయటపెట్టకుండా హమాలీ, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు లేకుండా రైతు సమయం వృథా కాకుండ గ్రామంలోనే ఎరువులు అందిచామని తెలిపారు. నాలుగు రోజుల నుంచి ఇక్కడికి వచ్చి ఉంటే ఒక్క లారీ ఒక్క బస్తా ఇస్తామని చెప్పడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడు దర్శనం దొరుకుతుంది కానీ ఎరువుల బస్తా దొరకడం లేదని మహిళా రైతు భాగ్యమ్మ చెప్పడం ఈ ప్రభుత్వం రైతుల పట్ల చిన్న చూపునకు నిదర్శనమని ఆక్షేపించారు హరీష్‌రావు .


ఓటీపీ విధానం తీసేయాలి...

వెంటనే ఓటీపీ విధానం, ఒక బస్తా విధానాన్ని తీసేయాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. ఓటీపీ పేరిట రేవంత్ ప్రభుత్వం రైతులను వేధిస్తోందని విమర్శించారు. రైతుల అవసరాల అనుగుణంగా ఎరువుల బస్తాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మళ్లీ పాత రోజులు వచ్చాయని.. ఇదేనా కాంగ్రెస్ మార్పు అని నిలదీశారు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం, నానో యూరియా వాడాలని చెప్పడం రైతులపై రూ.500 అదనపు భారం వేయడమేనని మండిపడ్డారు. నానో యూరియాతో రైతులకు ఎకరానికి రూ. 500 భారం పడుతుందని వాపోయారు. ప్రభుత్వం సబ్సిడీ నుంచి తప్పించుకోడానికి కృత్రిమ ఎరువులను సృష్టిస్తోందని ఆరోపించారు. ఎన్నికలు ఉన్నాయని బీహార్‌కు ఎరువులను తరలిస్తున్నారని విమర్శించారు హరీష్‌రావు .


బీజేపీ ఎంపీలు విఫలం...

తెలంగాణలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచి రాష్ట్రానికి ఎరువుల కొరత తీర్చడంలో విఫలం అయ్యారని హరీష్‌రావు ఫైర్ అయ్యారు. ఇద్దరు కేంద్రమంత్రులు తెలంగాణలో ఉండి ఎరువుల కొరతపై నోరు మెదపడం లేదని రైతుల ఉసరు ఉట్టిగా పోదని హెచ్చరించారు. 4 రోజుల నుంచి వ్యసాయ పనులు వృథా చేసుకొని రైతులు పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సీం రేవంత్‌రెడ్డి 51 సార్లు ఢిల్లీకి పోయారు కానీ ఎరువుల కొరత ఎందుకు తీర్చలేదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి తిట్లు ఎక్కువ.. పని తక్కువ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డికి తిట్ల మీద ఉన్న ధ్యాస.. పని మీద లేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఎరువులు ఎలా వచ్చాయి.. కాంగ్రెస్ హయాంలో ఎందుకు రావు అని ప్రశ్నించారు. వెంటనే ఓటీపీ, ఒక్క బస్తా విధానాన్ని తొలగించాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రానున్న మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

కంచ గచ్చిబౌలి.. పర్యావరణ పరిరక్షణలో మంచి ఫలితాలుంటే అభినందిస్తాం.. సీజేఐ ప్రశంసలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 13 , 2025 | 02:06 PM