Heavy Rains in Telangana: రానున్న మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
ABN , Publish Date - Aug 13 , 2025 | 10:05 AM
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
హైదరాబాద్, ఆగస్టు13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) పడుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ(బుధవారం) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్లౌడ్ బరెస్ట్ సందర్భంలో అనుసరించాల్సిన కార్యచరణ, తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్(X) వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.
రానున్న మూడు రోజులు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సెలవులు రద్దు చేసి అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మార్గనిర్దేశం చేశారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ట్రాన్స్‌ఫ్రార్మర్‌లు, జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. డ్రైనేజ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అత్యధిక వర్షాలు పడే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలని నిర్దేశించారు సీఎం రేవంత్‌రెడ్డి.
హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్‌లలో ట్రాఫిక్ నియంత్రణకు లా అండ్ ఆర్డర్ పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించారు. వర్షాలు, వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఎఫ్ఎం రేడియోల్లో అలర్ట్ చేయాలని దిశా నిర్దేశం చేశారు. పరిస్థితులను బట్టి స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాని సూచించారు. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సాధ్యమైనంత వరకు రోడ్లపై ట్రాఫిక్ తక్కువగా ఉండేలా చూడాలని ఆదేశించారు. అత్యవసర టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సమాచార శాఖ మీడియాకు సరైన సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.
నీటిపారుదల శాఖలో సెలవులు రద్దు: మంత్రి ఉత్తమ్

నీటిపారుదల శాఖలో సెలవులు రద్దు చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. నీటిపారుదల శాఖలో అన్ని విభాగాలకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాజెక్టులు, అనకట్టలు, కాల్వలతో పాటు చెరువులపై నిఘా పెంచాలని దిశానిర్దేశం చేశారు. విపత్తు సూచనలు కనిపిస్తే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్గ నిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గణేశ్ మండపాల జియో ట్యాగింగ్ తప్పనిసరి
ఆ ఏరియాల్లో 10 గంటల నుంచి విద్యుత్ సరఫరా బంద్..
Read latest Telangana News And Telugu News