Share News

Minister Damodara: వర్షాల్లో వైద్య సేవలు నిరవధికంగా కొనసాగించండి.. మంత్రి దామోదర ఆదేశాలు

ABN , Publish Date - Aug 13 , 2025 | 12:58 PM

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తోండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు ఆరోగ్యశాఖకు మంత్రి దామోదర రాజనర్సింహ కీలక సూచనలు చేశారు. వర్షాల్లో వైద్య సేవలు నిరవధికంగా కొనసాగించాలని ఆదేశించారు. గర్భిణుల కోసం అత్యవసర చికిత్సకూ సిద్ధంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు.

Minister Damodara: వర్షాల్లో వైద్య సేవలు నిరవధికంగా కొనసాగించండి.. మంత్రి దామోదర ఆదేశాలు
Minister Damodara Rajanarasimha

హైదరాబాద్, ఆగస్టు13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ(బుధవారం) నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షసూచన ఉన్నందున ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodara Rajanarasimha) సూచించారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి టెలీకాన్ఫరన్స్ నిర్వహించారు. హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, ఆర్‌ఎంవోలు, మెడికల్ ఆఫీసర్లు, డాక్టర్లు, సిబ్బంది ఈ మూడు రోజులు కచ్చితంగా హాస్పిటల్స్‌లోనే ఉండాలని.. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు మంత్రి దామోదర రాజనర్సింహ.


అందరి సెలవులు రద్దు చేయాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు‌. అత్యవసర పరిస్థితుల్లో‌ వచ్చే రోగులకు, గర్భిణులకు తక్షణమే వైద్య‌ సేవలు అందించాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ దగ్గరగా ఉన్న గర్భిణులను హాస్పిటల్స్‌లోని బర్త్ వెయిటింగ్ రూమ్స్‌కు తరలించి సేవలు అందించాలని మార్గనిర్దేశం చేశారు. అంబులెన్స్‌లు, 102 వాహనాలు అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని, ఎక్కడ ఎమర్జెన్సీ ఉన్నా తక్షణమే వెళ్లి పేషెంట్‌ను తరలించేలా‌ డ్రైవర్లు, ఈఎంటీలను 24 గంటలు అందుబాటులో ఉంచుకోవాలని మార్గ నిర్దేశం చేశారు మంత్రి దామోదర రాజనర్సింహ.


హాస్పిటళ్లలో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, కరెంట్ పోయిన మరుక్షణమే జనరేటర్స్ ఆన్ చేసి రోగులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఎలక్ట్రీషన్లను 24 గంటలు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో హాస్పిటల్స్‌ లోపలకు నీరు చేరకుండా, నిల్వ ఉండకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులంతా ఈ మూడు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ దిశానిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రానున్న మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

కంచ గచ్చిబౌలి.. పర్యావరణ పరిరక్షణలో మంచి ఫలితాలుంటే అభినందిస్తాం.. సీజేఐ ప్రశంసలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 13 , 2025 | 01:05 PM