Mallu Bhatti Vikramarka VS BRS: కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కాళేశ్వరం అంచనాలు పెంచారు.. మల్లు భట్టి విక్రమార్క ఫైర్
ABN , Publish Date - Aug 31 , 2025 | 09:59 PM
కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను లక్ష కోట్లకు పెంచారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అసెంబ్లీలో పెట్టొద్దని, చర్చ చేయొద్దని హైకోర్టుకు వెళ్లి చేయాల్సింది అంతా మీరే చేశారని మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
హైదరాబాద్, ఆగస్టు31, (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleshwaram Project) కేసీఆర్ ప్రభుత్వం (KCR Govt) చేసిన దోపిడీని ప్రజలు చూస్తున్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు ఏమైనా దైవాంశ సంబూతులా అని ప్రశ్నించారు.ఘోష్ కమిషన్ పారదర్శకంగా విచారణ జరిపిందని ఉద్ఘాటించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఇవాళ(ఆదివారం) తెలంగాణ అసెంబ్లీలో లఘు చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. కేసీఆర్, హరీష్‌రావులకు పీసీ ఘోష్ కమిషన్ నోటీసు వచ్చింది కాబట్టే మీరు విచారణకు వెళ్లారని... చెప్పాల్సింది చెప్పారని తెలిపారు మల్లు భట్టి విక్రమార్క.
ఇవ్వాల్సిన కాగితాలు ఇచ్చారని.. ఆ తర్వాతనే కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని గుర్తుచేశారు. తమకు కక్ష సాధింపు ఉంటే, ఇప్పటికే ఏం చేయాలో అది చేసే వాళ్లమని చెప్పుకొచ్చారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అసెంబ్లీలో పెట్టొద్దని, చర్చ చేయొద్దని హైకోర్టుకు వెళ్లి చేయాల్సింది అంతా మీరే చేశారని వెల్లడించారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను లక్ష కోట్లకు పెంచారని విమర్శించారు. ఎత్తిపోసిన నీళ్లకంటే మీరు కిందికి వదిలేసిన నీరే ఎక్కువ అని చెప్పుకొచ్చారు మల్లు భట్టి విక్రమార్క.
బాబా సాహెబ్ పేరు ఉండొద్దని కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరును మార్చారని మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్ట్ మీ కోసం కట్టుకున్నది కానీ ప్రజల కోసం కాదని స్పష్టం చేశారు. హరీష్‌రావు అన్ని చెప్పారు కానీ కాళేశ్వరం రిపోర్ట్‌పై ఏం చేయాలో ఎందుకు చెప్పాలేదని ప్రశ్నించారు. ఈ నివేదిక పై ఏం చర్యలు తీసుకుందామో అందరూ చెప్పాలని సూచించారు. కాళేశ్వరం రిపోర్ట్‌పై ఓ నిర్దిష్టమైన నిర్ణయం ఈ రోజు జరగాలని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీజేపీ హక్కులను కొల్లగొడుతోంది.. మోదీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్‌లో ఉంటే.. కిరాయి ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంది..
For More TG News And Telugu News