Khairatabad Vishwa Maha Ganapati Shobhayatra 2025: ఖైరతాబాద్ విశ్వమహాగణపతి శోభాయాత్ర ప్రారంభం
ABN , Publish Date - Sep 06 , 2025 | 06:49 AM
ఖైరతాబాద్ విశ్వమహాగణపతి శోభాయాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది. హుస్సేన్‌సాగర్ వద్ద బడా గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ గణపతి శోభాయాత్రను చూడటానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.
హైదరాబాద్, సెప్టెంబరు6 (ఆంధ్రజ్యోతి): ఖైరతాబాద్ విశ్వమహాగణపతి శోభాయాత్ర (Khairatabad Vishwa Maha Ganapati Shobhayatra) ఇవాళ(శనివారం) ఉదయం ప్రారంభమైంది. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో విశ్వశాంతి మహా శక్తి గణపతిగా దర్శనం ఇచ్చారు ఖైరతాబాద్ బడా గణేష్. శోభాయాత్ర మార్గంలో రూట్‌ను క్లియర్ చేస్తున్నారు పోలీసులు. హుస్సేన్‌సాగర్ వద్ద బడా గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ గణపతి శోభాయాత్రను చూడటానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. దీంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. హుస్సేన్‌సాగర్ వద్ద ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం మధ్యాహ్నం 2 గంటల్లోపు పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.
అయితే, అర్ధరాత్రి 12 గంటలకు బడా గణేష్‌కు కలశ పూజ నిర్వహించారు. పూజల అనంతరం ట్రాలీ పైకి చేర్చారు. ఈ ఏడాది 50 టన్నుల బరువుతో ఖైరతాబాద్ గణేష్ ఉన్నారు. విజయవాడ నుంచి వచ్చిన 200 టన్నుల కేపాసిటీ గల టస్కర్‌పై బడా గణేష్ శోభాయాత్ర కొనసాగనుంది. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్ 4 వద్ద వినాయకుడిని నిమజ్జనం చేయనున్నారు. ఖైరతాబాద్ గణేష్‌కు కుడి వైపున శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు, ఎడమ వైపున గజ్జలమ్మ అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్‌ను 50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.
మరోవైపు.. గణేష్ విగ్రహాల ఎత్తుల ప్రకారం రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా రూట్ డైవర్షన్లు చేస్తున్నట్లు తెలిపారు. 250 కెమెరాలు, 9 డ్రోన్లతో హుస్సేన్ సాగర్ దగ్గర భద్రత ఏర్పాటు చేశామని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఈ క్రమంలో హుస్సేన్‌సాగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో నిమజ్జనాలు చేసేలా జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు చూస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, సంజీవయ్య పార్క్ వైపు అందుబాటులో క్రేన్లను ఉంచారు. భక్తుల కోసం మెడికల్ క్యాంపులు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు.
సరూర్‌నగర్, IDL, సఫిల్‌గూడ, సున్నంచెరువుతో పాటు 20 ప్రాంతాల్లో భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు సిద్ధం చేశారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ 30 వరకు క్రేన్లు ఏర్పాటు చేశారు. గ్రేటర్ వ్యాప్తంగా 303 కిలోమీటర్ల మేర శోభాయాత్రలు జరుగనున్నాయి. నిమజ్జనానికి 30వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. 20 చెరువులు, 72 కృత్రిమ కొలనుల్లో నిమజ్జనాలు జరుగనున్నాయి. అందుబాటులో 150 గణేష్ యాక్షన్ టీమ్‌లు ఉన్నాయి.
హుస్సేన్‌సాగర్‌లో 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. శోభాయాత్ర వాహనాలతో కిక్కిరిసింది నెక్లెస్ రోడ్డు. వినాయక నిమజ్జనానికి వాహనాలు బారులు తీరాయి. శోభాయాత్ర సందర్భంగా జంట నగరాల్లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్-ప్యాట్నీ-రాణిగంజ్-ట్యాంక్‌బండ్, టోలిచౌకి-మెహిదీపట్నం-ఖైరతాబాద్, టప్పాచబుత్ర-అసిఫ్‌నగర్-ఎంజే మార్కెట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News