Share News

Ganesh Immersion: నేడే గణేష్‌ మహానిమజ్జనం

ABN , Publish Date - Sep 06 , 2025 | 03:57 AM

బొజ్జగణపయ్య గంగమ్మ ఒడికి చేరే సమయం వచ్చేసింది. నగరంలో గల్లీ గల్లీన వెలిసి..

Ganesh Immersion: నేడే గణేష్‌ మహానిమజ్జనం

హైదరాబాద్‌లో 20 నిమజ్జన కేంద్రాలు.. అదనంగా 74 కృత్రిమ కొలనులు కూడా

  • 1.30లోపు గంగఒడికి ఖైరతాబాద్‌ గణపతి

  • నేడు అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు

  • ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవాలతో రాష్ట్రానికి పేరు: రేవంత్‌ రెడ్డి

  • మహాగణపతికి సీఎం పూజలు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): బొజ్జగణపయ్య గంగమ్మ ఒడికి చేరే సమయం వచ్చేసింది. నగరంలో గల్లీ గల్లీన వెలిసి.. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణపయ్య ‘‘మహా నిమజ్జనం’’ కోసం శోభయాత్రగా బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు. శనివారం జరిగే ఈ వేడుకకు ప్రభుత్వ విభాగాలు ఏర్పాట్లు పూర్తిచేశాయి. హుస్సేన్‌సాగర్‌, సరూర్‌నగర్‌, సఫిల్‌గూడ, ఐడీఎల్‌ తదితర 20 ప్రధాన నిమజ్జన కేంద్రాలు, మరో 74 కృత్రిమ కొలనుల వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిమజ్జనం కోసం 134 స్టాటిక్‌, 259 మొబైల్‌ క్రేన్లను జీహెచ్‌ఎంసీ సిద్ధం చేసింది. హుస్సేన్‌సాగర్‌ వద్ద ఖైరతాబాద్‌ విశ్వమహాగణపతి నిమజ్జనం మధ్యాహ్నం 1.30 గంటల్లోపు పూర్తి చేయనున్నారు. ఇందుకు ఉదయం 6:30కే మహా గణపతి శోభాయాత్ర మొదలుపెట్టాలని నిర్ణయించారు. బాలాపూర్‌ గణపతి సాయంత్రం 5 గంటల్లోపు ట్యాంక్‌బండ్‌కు చేరేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హుస్సేన్‌సాగర్‌కు వచ్చే భక్తుల సౌకర్యార్ధం శనివారం ఆర్టీసీ 600 ప్రత్యేక బస్సులను నడపనుంది. శోభాయాత్ర మార్గాల్లో 35 లక్షల మంచినీటి ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. వ్యర్థ్యాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు 160 గణేశ్‌ యాక్షన్‌ బృందాలు, 14,486 పారిశుధ్య కార్మికులు విధుల్లో ఉంటారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలగకుండా 104 ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు అందుబాటులో ఉంచారు. 101 ప్రత్యేక బృందాలతోపాటు విద్యుత్తుశాఖకు చెందిన 2 వేల మంది విధుల్లో ఉంటారు. 30వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అశ్వదళం, జాగిలాలతో గస్తీ నిర్వహించనున్నారు. నిమజ్జన కేంద్రాల వద్ద బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారు. నిమజ్జనం సందర్భంగా అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు నడుపుతామని అధికారులు ప్రకటించారు.


మతసామరస్యానికి హైదరాబాద్‌ ప్రతీక

ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవాలు తెలంగాణకు మంచి పేరు తెచ్చి పెట్టాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అన్ని మతాలను గౌరవిస్తూ హైదరాబాద్‌ నగరం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. ఖైరతాబాద్‌ శ్రీవిశ్వశాంతి మహా గణపతిని శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి ఆ విఘ్నేశ్వరుడి కృప ప్రజలందరిపైనా ఉండాలని ప్రార్థించారు. అనంతరం భక్తులనుద్ధేశించి రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. 71 ఏళ్ల క్రితం ఒక్క అడుగుతో గణేశ్‌ ఉత్సవాలు ప్రారంభమయ్యాయని, ఈ రోజు 69 అడుగుల ఎత్తుకు ఎదిగిందని, 71 సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు, కష్టాలొచ్చినా దేశంలోనే ఈ గణేష్‌ ఉత్సవాలను చర్చించుకునే విధంగా జరుపుతున్నారంటూ నిర్వాహకులను అభినందించారు. హైదరాబాద్‌లో 1.4 లక్షల విగ్రహాలను ప్రతిష్టించుకొని అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుపుకొంటున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గణేశ్‌ మండపాలకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నామని, కాగా ఖైరతాబాద్‌ గణనాథుడిని బీజేపీ రాష్ట్ర చీఫ్‌ రామచంద్రరావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.


ఇవి కూడా చదవండి

భారత్‌లో తొలి టెస్లా కారు డెలివరీ.. కస్టమర్ ఎవరంటే..

భారత్‌ను ముక్కలు చేయాలంటూ పోస్టు.. ఆస్ట్రియా ఆర్థికవేత్త ఎక్స్ అకౌంట్‌పై నిషేధం

For More National News and Telugu News

Updated Date - Sep 06 , 2025 | 03:57 AM