Ganesha Laddu: భక్తి.. కీర్తి.. సేవ!
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:44 AM
గణేశుడి లడ్డూ అంటే ఇప్పుడు ఎంతో క్రేజ్.. తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణేశుడి ప్రసాదాన్ని పొందేందుకు ఎంత ఖర్చయినా సరే అన్నట్టుగా భక్తులు పోటీపడుతున్నారు.
గణనాథుడి లడ్డూ కోసం పోటాపోటీ వేలంపాటలు
లక్షల నుంచి కోట్లకు చేరుతున్న లడ్డూ
లడ్డూ పొందితే మంచి జరుగుతుందని కొందరిలో నమ్మకం
స్థానికంగా గుర్తింపు, రాజకీయ పలుకుబడి కోసం మరికొందరి ఆరాటం
పలుచోట్ల లడ్డూ వేలం సొమ్ముతో సేవా కార్యక్రమాలు
వేలం ఉండని ఖైరతాబాద్ గణపతి లడ్డూ
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): గణేశుడి లడ్డూ అంటే ఇప్పుడు ఎంతో క్రేజ్.. తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణేశుడి ప్రసాదాన్ని పొందేందుకు ఎంత ఖర్చయినా సరే అన్నట్టుగా భక్తులు పోటీపడుతున్నారు. వేలు, లక్షలే కాదు కోట్ల రూపాయల వరకు వేలం పాడి లడ్డూను సొంతం చేసుకుంటున్నారు. దీనిని చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. లడ్డూకు ఇంత పోటీ వెనుక భక్తితోపాటు గుర్తింపు కోసం ఆరాటం, సేవ చేయాలనే ఉదాత్త లక్ష్యం కూడా ఉండటం విశేషం.
మంచి జరుగుతుందన్న నమ్మకంతో..
వినాయక నవరాత్రుల సందర్భంగా గణేశుడికి ప్రసాదంగా పెట్టిన లడ్డూను చివరి రోజున భక్తులకు పంచేవారు. అక్కడక్కడా వేలంపాట నిర్వహించేవారు. అదీ స్వల్ప మొత్తాల్లోనే ఉండేది. కానీ కొన్నేళ్లుగా దాదాపు ప్రతిచోటా లడ్డూ వేలం వేస్తున్నారు. గణేశుడి లడ్డూను సొంతం చేసుకుంటే అదృష్టం వస్తుందని, మంచి జరుగుతుందనే నమ్మకంతో డిమాండ్ పెరిగింది. ఒకసారి వేలంలో లడ్డూ పొందినవారు తర్వాతి ఏడాది కూడా మళ్లీ వేలానికి వస్తుండటంతో వారికి మంచి జరిగి ఉంటుందనే అభిప్రాయంతో మిగతా వారూ పోటీపడుతున్నారని గణేశ మండపాల నిర్వాహకులు చెబుతున్నారు.
గుర్తింపు, రాజకీయ పలుకుబడి కూడా..
రియల్ ఎస్టేట్, మద్యం వ్యాపారులు, ఇతర వ్యాపారాల్లో బాగా సంపాదించినవారు కొందరు.. మంచి జరుగుతుందనే నమ్మకంతోపాటు గుర్తింపు కోసం కూడా గణపతి లడ్డూను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కువ ధరకు వేలం పాడుతున్నారు. లక్షలు వెచ్చించి దక్కించుకుంటుండటంతో స్థానికుల్లో వారి పేరు చర్చనీయాంశంగా మారుతోంది. ఇలాంటి వ్యాపారుల్లో చాలా మంది ఏదో ఓ రాజకీయ పార్టీలో స్థానిక నేతలు మారుతున్నారు.
సేవా కార్యక్రమాలకు.. మరుసటి ఉత్సవాలకు..
పలుచోట్ల కాలనీలు, అపార్ట్‌మెంట్లలోని పెట్టిన గణేశ మండపాల్లో లడ్డూ వేలంతో వచ్చిన సొమ్మును సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. హైదరాబాద్ బండ్లగూడలోని రిచ్‌మండ్ విల్లావాసులు గత ఐదేళ్లుగా లడ్డూ వేలం డబ్బును తమ టౌన్‌షి్‌పలో పనిచేసే కూలీల పిల్లల చదువులకు, ఇతర సేవా కార్యక్రమాలకు అందిస్తున్నారు. రిచ్‌మండ్ విల్లా టౌన్‌షి్‌పలో గణేశుడి లడ్డూ ఈ ఏడాది ఏకంగా రూ.2.3 కోట్లకు తీసుకోవడం గమనార్హం. ఇక నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల్లోని పలు అపార్ట్‌మెంట్లలో లడ్డూ వేలం సొమ్మును ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నారు. ఇప్పటివరకు లడ్డు వేలం ద్వారా వచ్చిన మొత్తం రూ.1.64 కోట్లతో బాలాపూర్‌లోని దేవాలయాలు, పాఠశాలల అభివృద్ధికి ఖర్చుచేసినట్లు బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డి తెలిపారు. కాగా, గణేశుడి లడ్డూ వేలం ద్వారా వచ్చిన సొమ్మును కొంతమంది నిర్వాహకులు మరుసటి ఏడాది జరిగే ఉత్సవాల కోసం వినియోగిస్తుంటారు.
ఖైరతాబాద్ గణేశ్ వద్ద భారీ లడ్డూ ఉండదు
దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ మహా గణపతి వద్ద ప్రస్తుతం భారీ లడ్డూ ప్రసాదం ఏమీ పెట్టడం లేదు. నిజానికి ఇటీవలి వరకు భారీ లడ్డూను గణపయ్య చేతిలో, వేదికపై ఉంచేవారు. దానిని వేలం వేయకుండా భక్తులకు పంపిణీ చేసేవారు. అయితే ఈ లడ్డూ ప్రసాదం కోసం భారీగా భక్తులు రావడం, తీవ్ర ఇబ్బంది తలెత్తుతుండటంతోపాటు కొందరికే ప్రసాదం పంపిణీ చేయడం బాగోలేదన్న ఆలోచనతో భారీ లడ్డూను పెట్టడాన్ని ఉత్సవ కమిటీ నిలిపివేసింది. ప్రస్తుతం వినాయకుడి చేతిలో కృత్రిమ లడ్డూను పెడుతున్నారు. భక్తులెవరైనా లడ్డూ తీసుకొస్తే గణేశుడి వద్ద పెట్టి పూజ చేసిన వెంటనే వారికి అందజేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫలించిన ప్రభుత్వ ప్రయత్నం.. తెలంగాణకు యూరియా రాక..
మద్యం కుంభకోణం కేసులో కీలక పురోగతి
Read Latest TG News and National News