Share News

CM Revanth Reddy: బీఆర్‌ఎస్, బీజేపీది ఫెవికాల్‌ బంధం.. సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Oct 31 , 2025 | 10:19 PM

జూబ్లీహిల్స్‌ గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఒడిదొడుకులు, ఎత్తుపల్లాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. అందరికీ అన్నిసార్లు అవకాశం రాకపోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

CM Revanth Reddy: బీఆర్‌ఎస్, బీజేపీది ఫెవికాల్‌ బంధం.. సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్
CM Revanth Reddy

హైదరాబాద్, అక్టోబరు31(ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ (Jubilee Hills) గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ(శుక్రవారం) జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక (Jubilee Hills Bypoll) ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు మద్దతుగా రేవంత్‌ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. రాజకీయాల్లో ఒడిదొడుకులు, ఎత్తుపల్లాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. అందరికీ అన్నిసార్లు అవకాశం రాకపోవచ్చని తెలిపారు. మన కోసం కష్టపడే వ్యక్తిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మన కోసం కష్టపడే వ్యక్తిని గెలిపించుకోకపోతే చారిత్రక తప్పిదమేనని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్‌‌రెడ్డి.


సెంటిమెంట్‌ పేరుతో ఆశీర్వదించాలని బీఆర్‌ఎస్‌ అంటోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌, బీజేపీపై సీఎం రేవంత్‌రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ కుమార్ తెలంగాణకు ఏం తెచ్చారు..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఏనాడైనా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేసిందా? అని నిలదీశారు. డ్రగ్స్‌, గంజాయితో దొరికినవారు రౌడీలా..? నవీన్‌ యాదవ్‌ రౌడీనా..? అని ప్రశ్నించారు. గతంలో పీజేఆర్ చనిపోతే టీడీపీ అభ్యర్థిని నిలబెట్టలేదని గుర్తుచేశారు. పీజేఆర్‌ కుటుంబంపై బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని నిలబెట్టిందని తెలిపారు. సంప్రదాయాన్ని తుంగలో తొక్కింది బీఆర్‌ఎస్‌ కాదా..? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ను ఎవరూ నమ్మే పరిస్థితి లేరని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్‌‌రెడ్డి.


సానుభూతి ఓట్లు అడిగే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదని ఆక్షేపించారు. బీఆర్‌ఎస్, బీజేపీది ఫెవికాల్‌ బంధమని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో మహిళకు మంత్రి పద ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. తమ కేబినెట్‌లో సీతక్క, కొండా సురేఖలకు మంత్రి పదవులు ఇచ్చామని ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వంలో ఆడబిడ్డల కోసం ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించామని నొక్కిచెప్పారు. బిల్లా, రంగాలు ఆటోలో తిరుగుతూ ఫ్రీ బస్సు రద్దు చేయాలంటున్నారని సెటైర్లు గుప్పించారు. బిల్లా, రంగాలు బస్తీలోకి వస్తే స్తంభానికి కట్టేయాలని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్‌‌రెడ్డి.


గతంలో మున్సిపల్‌ మంత్రిగా కేటీఆర్‌ పనిచేశారని.. జూబ్లీహిల్స్‌ బస్తీలో ఆయన ఎప్పుడైనా తిరిగారా..? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో ఆటో సోదరులను ఆదుకుంటామని భరోసా కల్పించారు. పేదలకు కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చామని గుర్తుచేశారు. ఏడాదిలోనే 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు. కల్వకుంట్ల ఇంటి సొంత ఆడబిడ్డ బయటకు వచ్చి కన్నీళ్లు పెడుతోందని తెలిపారు. సొంత ఆడబిడ్డను జైలుకు పంపించారని ఫైర్ అయ్యారు. పీజేఆర్‌ చనిపోతే ఏకగ్రీవ ఎన్నికకు చంద్రబాబు సహకరించారని చెప్పుకొచ్చారు. ఉపఎన్నికలో పీజేఆర్‌ కుటుంబంపై బీఆర్‌ఎస్‌ పోటీ పెట్టిందని సీఎం రేవంత్‌‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రేవంత్‌ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకి కార్పొరేషన్ల పదవులు

తెలంగాణలో దుర్మార్గమైన పాలన.. మహేశ్వర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 31 , 2025 | 10:28 PM