Share News

Maheshwar Reddy: తెలంగాణలో దుర్మార్గమైన పాలన.. మహేశ్వర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Oct 31 , 2025 | 05:02 PM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, మజ్లిస్ ఆడుతున్న నాటకాలని ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఈ ఎన్నికలో ఎంఐఎం అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదని నిలదీశారు. ఒక వర్గం మెప్పు కోసం కాంగ్రెస్ చేసే ప్రయత్నం చట్ట వ్యతిరేకమని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆక్షేపించారు.

Maheshwar Reddy: తెలంగాణలో దుర్మార్గమైన పాలన.. మహేశ్వర్ రెడ్డి  షాకింగ్ కామెంట్స్
Alleti Maheshwar Reddy Fires ON Congress

హైదరాబాద్, అక్టోబరు31(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రమంతా మొంథా తుఫాన్‌ (Cyclone Motha)తో అల్లకల్లోలం అవుతోందని.. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఏం చర్యలు చేపట్టారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) ప్రశ్నించారు. మొంథా తుఫాన్‌‌ చర్యలపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని చూసి రేవంత్‌రెడ్డి నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఏప్రిల్, మేలో కూడా అకాల వర్షాలు కురిశాయని.. ఆ సమయంలో పంట నష్టం జరిగితే సీఎం రేవంత్‌రెడ్డి రూ. 10 వేలు పరిహారం ఇస్తామని చెప్పారని.. ఇంకా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. కేవలం పేపర్ స్టేట్‌మెంట్ మాత్రమే ఇస్తున్నారని.. ఆచరణలోకి ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవాళ(శుక్రవారం) హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.


తుఫాను, వర్షం తదితర విపత్కర పరిస్థితులపై అధికారులతో లెక్కలు తెప్పించుకోవడం.. తర్వాత గాలికి వదిలేయడం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక.. ఎన్ని ఎకరాలకు పరిహారం ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలని, రైతులని ఆదుకోవాలనే ఆలోచన రేవంత్‌రెడ్డికి లేదని ఫైర్ అయ్యారు. తడిసిన ధాన్యంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన పాలన జరుగుతుందో ఇంత కంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. మొసలి కన్నీళ్లు కార్చి.. గాలి మోటార్లలో సీఎం రేవంత్‌రెడ్డి తిరుగుతున్నారని ఆక్షేపించారు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.


జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మైనార్టీ ఓట్ల కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఆడుతున్న ఆటని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. అజారుద్దీన్ క్రికెటర్‌గా మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయని.. ఆయనతో మంత్రిగా ఎలా ప్రమాణ స్వీకారం చేయించారని ప్రశ్నల వర్షం కురిపించారు. గో సంరక్షకులను తుపాకీతో కాలిస్తే ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. సీఎం వెనుక మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఉన్నారని ఆరోపించారు. అసదుద్దీన్ డి ఫాక్టో సీఎంగా వ్యవహారిస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.


జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, మజ్లిస్ ఆడుతున్న నాటకాలని ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు రాజ్యాంగాన్ని ఇద్దరే చదివినట్లున్నారని విమర్శించారు. ఒక వర్గం మెప్పు కోసం కాంగ్రెస్ చేసే ప్రయత్నం చట్ట వ్యతిరేకమని ఆక్షేపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్‌కి మజ్లిస్ మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ ఎన్నికలో ఎంఐఎం అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదని నిలదీశారు. అజారుద్దీన్‌కి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కాకముందే మంత్రి పదవిని అసదుద్దీన్ ఇప్పించుకున్నారని విమర్శించారు. హిందువులను విస్మరించిన సీఎం రేవంత్‌రెడ్డి మైనార్టీ నేతలకి పట్టం కడుతున్నారని ఫైర్ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హిందువులే కాంగ్రెస్‌కి దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వబోతున్నారని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రేవంత్‌ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకి కార్పొరేషన్ల పదవులు

ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. నేటితో ముగియనున్న గడువు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 31 , 2025 | 05:32 PM