Kolikapudi Fires On Jagan: జగన్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు విధ్వంసం
ABN , Publish Date - Oct 17 , 2025 | 03:42 PM
జగన్ తన ఐదేళ్ల పాలనలో ఏపీలోని సాగునీటి ప్రాజెక్టులను విధ్వంసం చేశారని టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. రివర్స్ టెండరింగ్ పేరుతో మొత్తం పోలవరం ప్రాజెక్టుని వరదల్లో ముంచేశారని కొలికపూడి శ్రీనివాసరావు విమర్శించారు.
అమరావతి, అక్టోబరు17 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై తెలుగుదేశం పార్టీ తిరుపూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (MLA Kolikapudi Srinivasa Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) విధ్వంసం అయిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు ప్రాణం పోశారని ఉద్ఘాటించారు. ఇవాళ(గురువారం) తిరుపూర్‌లో మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.
పోలవరం నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం దీపావళి శుభవార్త చెప్పిందని పేర్కొన్నారు. నిర్వాసితుల కోసం కూటమి ప్రభుత్వం తాజాగా రూ.1,100 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. ఇదే ఏడాది జనవరిలో మరో రూ.1000 కోట్లు విడుదల చేసిందని గుర్తుచేశారు. 16 నెలల్లోనే నిర్వాసితులకు రూ.2,100 కోట్లు తమ ప్రభుత్వంలో విడుదల చేశామని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో ఏపీలోని సాగునీటి ప్రాజెక్టులను విధ్వంసం చేశారని ధ్వజమెత్తారు కొలికపూడి శ్రీనివాసరావు.
రివర్స్ టెండరింగ్ పేరుతో మొత్తం పోలవరం ప్రాజెక్టుని వరదల్లో ముంచేశారని విమర్శించారు. పోలవరం నిర్వాసితులకు గత వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఎందుకు కేటాయించలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ అసమర్థత కారణంగానే డయాఫ్రం వాల్ దెబ్బతిందని ఐఐటీ హైదరాబాద్ నిపుణులు వెల్లడించారని గుర్తుచేశారు. పోలవరం పూర్తికాకుండానే కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా నీళ్లు ఇస్తున్నట్లు జగన్ డ్రామా ఆడారని ఎద్దేవా చేశారు.
వెలిగొండ ప్రాజెక్టు పూర్తికాకుండానే జాతికి అంకితం చేసి జగన్ నవ్వులపాలయ్యారని సెటైర్లు గుప్పించారు. అక్రమ ఇసుక దందా కోసం అన్నమయ్య ప్రాజెక్టును వరదల్లో ముంచేసి... 42 మంది ప్రాణాలు తీశారని ఫైర్ అయ్యారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసేలా తమ ప్రభుత్వంలో పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటివరకు 86 శాతం పూర్తి అయ్యాయని చెప్పుకొచ్చారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి సూపర్ హిట్ చేశామని నొక్కిచెప్పారు. ఏపీలోని యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సామాన్యులకు ఉపయోగపడేలా పోస్టల్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పురోగతి: పెమ్మసాని
మెడికల్ కాలేజీలను పీపీపీతో చేస్తే తప్పేంటి?: మంత్రి సత్యకుమార్
Read Latest AP News And Telugu News