MP Shivnath Fires on Jagan: దొంగ మద్యం వెనుక జగన్ అండ్ కో హస్తం:ఎంపీ కేశినేని శివనాథ్
ABN , Publish Date - Oct 13 , 2025 | 09:19 PM
ఏపీలో దొంగచాటుగా దొంగ మద్యం అమ్మించిన వైసీపీ మరో కొత్త డ్రామాకు తెరదీసిందని తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ధ్వజమెత్తారు. దొంగ మద్యంలో కేసులో వైసీపీ ముఖ్య నాయకుల్లో ఒక పేరు బయటికి వచ్చిందని చెప్పుకొచ్చారు ఎంపీ కేశినేని శివనాథ్.
విజయవాడ, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): దొంగ మద్యం స్కాం (Fake Liquor Scam) పేరుతో డ్రామాలు ఆడిన వైసీపీ నాయకుల (YSRCP Leaders)పై తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (TDP MP Kesineni Shivnath) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా వైసీపీ దొంగ మద్యం పేరుతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అల్లరి చేయటానికి ప్రయత్నించి విఫలం చెందిందని విమర్శించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో దొంగ మద్యాన్ని ఎక్కడిక్కడ కట్టడి చేశామని స్పష్టం చేశారు ఎంపీ కేశినేని శివనాథ్.
ఏపీలో దొంగచాటుగా దొంగ మద్యం అమ్మించి వైసీపీ మరో కొత్త డ్రామాకు తెరదీసిందని ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులు సౌత్ ఆఫ్రికాలో ఒక గదిలో దొంగ మద్యం ఏ విధంగా తయారు చేస్తున్నారో.. అదే విధంగా ఇబ్రహీంపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో తయారు చేస్తున్నారని ఆరోపించారు. ఇవాళ (సోమవారం)విజయవాడలో మీడియాతో మాట్లాడారు ఎంపీ కేశినేని శివనాథ్.
వైసీపీ కొత్త డ్రామా..
వైసీపీ గజదొంగలు, బందిపోట్లు కలిసి సీఎం చంద్రబాబు నాయుడుపై అభాండాలు వేయటానికి కొత్త డ్రామా మొదలుపెట్టారని ఫైర్ అయ్యారు. వైసీపీ డ్రామాను ఎన్డీఏ కూటమి నాయకులు కట్టడి చేయటమే కాకుండా.. దొంగ మద్యం వెనుక ఉన్న నేరస్థులను బయటకు తీసుకువచ్చామని తెలిపారు. దొంగ మద్యం కేసులో పట్టుబడిన ఏ (1) ముద్దాయి.. వైసీపీకి బాగా కావాల్సిన వ్యక్తి అని... ఆ వ్యక్తి వెనక వైసీపీ గజదొంగలు, బందిపోట్లు అందరూ ఉన్నారని ఆరోపించారు. దొంగ మద్యం కేసులో వైసీపీ ముఖ్య నాయకుల్లో ఒకరి పేరు బయటికి వచ్చిందని చెప్పుకొచ్చారు ఎంపీ కేశినేని శివనాథ్.
వారి పేర్లు త్వరలో బయటికి..
మిగిలిన వారందరి పేర్లు త్వరలో బయటికి వస్తాయని హెచ్చరించారు. దొంగ మద్యం వ్యాపారం 2022 నుంచి ఇక్కడ జరుగుతోందని వెల్లడించారు. ఏపీలో దొంగ మద్యం వ్యాపారం చేయాలనుకున్న వారి కుట్రలు అన్ని బయటికి వస్తున్నాయని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న వైసీపీ నాయకులందరితో పాటు దేవినేని అవినాష్, పేర్ని నాని, జోగి రమేష్, వెలంపల్లి శ్రీనివాస్ హస్తం దొంగ మద్యం వ్యాపారంలో ఉందని ఆరోపించారు ఎంపీ కేశినేని శివనాథ్.
వాళ్లకి శిక్ష ఖాయం..
ఈ విషయం త్వరలోనే బయటపడుతోందని హెచ్చరించారు. ఈ గజదొంగలకు ముఠా నాయకుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హస్తం కూడా ఉందని విమర్శించారు. త్వరలోనే జగన్ అండ్ కో షేర్ ఎంతో తెలుతుందని చెప్పుకొచ్చారు. తప్పకుండా వాళ్లకి శిక్ష పడుతుందనిహెచ్చరించారు. రూ.50 వేల కోట్లు మద్యం ద్వారా ఆదాయం పొందింది వైసీపీ నాయకులేనని ఎద్దేవా చేశారు. జగన్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవటం ఖాయమని హెచ్చరించారు ఎంపీ కేశినేని శివనాథ్.
జీఎస్టీపై అవగాహన: ఎంపీ కేశినేని శివనాథ్
మరోవైపు.. విజయవాడలోని పున్నమి ఘాట్ - బేరం పార్క్ వద్ద గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌ని ప్రారంభించారు ఎంపీ కేశినేని శివనాథ్. ఈ వేడుకలో కలెక్టర్ లక్ష్మీ శా, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియా, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈరోజు నుంచి ఈ నెల 19వ తేదీ వరకు గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పిస్తున్నామని వివరించారు ఎంపీ కేశినేని శివనాథ్.
షాపింగ్ ఫెస్టివల్..
ఈ వారంలో ప్రతి జిల్లాలో షాపింగ్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అన్ని వస్తువులపై 10 శాతం జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం తగ్గించిందని వెల్లడించారు. జీఎస్టీ తగ్గిన వస్తువులపై అవగాహన పెంచేందుకు గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని తెలిపారు. విజయవాడ నగర వాసులకు గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ దీపావళి పండుగ సందర్భంగా ఒక బొనాంజ లాంటిదని ఉద్ఘాటించారు. వికసిత్ భారత్ -2047, స్వర్ణాంధ్ర -2047 లక్ష్యాలను చేరటానికి జీఎస్టీ తగ్గింపు ఎంతగానో ఉపయోగపడుతోందని వివరించారు. స్వదేశీ వస్తువుల వినియోగం పెరిగేందుకు జీఎస్టీ తగ్గింపుతో ఒక ప్రోత్సహం లభించిందని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్
ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు
Read Latest AP News And Telugu News