Share News

Sudhir Reddy on Rayudu Case: ఎవర్నీ వదిలేది లేదు.. బొజ్జల సుధీర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Oct 13 , 2025 | 07:55 PM

కావాలనే తనపై కొంతమంది బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వినుత డ్రైవర్ రాయుడు పేరుతో విడుదలైన వీడియోపై విచారణ జరగాలని కోరారు.

Sudhir Reddy on Rayudu Case: ఎవర్నీ వదిలేది లేదు.. బొజ్జల సుధీర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
MLA Bojjala Sudhir Reddy on Driver Rayudu Case

శ్రీకాళహస్తి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): కావాలనే తనపై కొంతమంది బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి (Srikalahasti MLA Bojjala Sudhir Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట వినుత డ్రైవర్ రాయుడు పేరుతో విడుదలైన వీడియోపై పోలీసుల విచారణ జరగాలని కోరారు. ఈ విషయంలో ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.


ఎలాంటి విచారణకైనా సిద్ధం..

తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. తనకు వినుత డ్రైవర్ రాయుడు తెలియదని క్లారిటీ ఇచ్చారు. వినుత బెయిల్ రద్దు చేయాలని కోరారు. న్యాయవాదులతోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. డ్రైవర్ రాయుడు వీడియో నమ్మేలా లేదని చెప్పుకొచ్చారు. డ్రైవర్ రాయుడుది ఏఐ వీడియోనా.. లేదా ఆయనని చంపేస్తామని బెదిరించి రికార్డు చేసి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను సీఎం చంద్రబాబుకు, టీడీపీ హై కమాండ్‌కి వివరిస్తానని పేర్కొన్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.


వినుతకి డిపాజిట్ రాలేదు..

‘మా కుటుంబం 45 ఏళ్ల నుంచి శ్రీకాళహస్తి ప్రజలకు సేవ చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇప్పటివరకు మేము ప్రజల్లో ఉన్నాం. నాన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి, మాకు మంచి పేరు ఉంది. 2019లో జనసేన నుంచి కోట వినుత పోటీ చేసినా డిపాజిట్ కూడా రాలేదు. 2024లో కూటమి ప్రభుత్వం తరఫున టికెట్ నాకు వచ్చింది. కష్టపడి పని చేశాం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అందరి ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలిచాం. ఎప్పుడూ, ఎన్నడూ లేని విధంగా శ్రీకాళహస్తిలో పరిస్థితులు మారాయి. కోట వినుత దంపతులు వాళ్ల డ్రైవర్‌ని హత్య చేశారు. నిన్న నాలుగు గంటలకు నాకు ఒక వీడియో వచ్చింది. హత్య చేయబడ్డ డ్రైవర్ రాయుడు వీడియో అది. ఈ వీడియో ఏఐదా లేదా, రాయుడు హత్యకి ముందు వీడియో తీసి ఉంటారా? అనేది తెలియాలి. రాయుడు హత్య జరిగి రెండు నెలలు దాటింది. కోట వినుత దంపతులు జైలుకు కూడా పోయారు. ఇప్పుడు వీడియో విడుదల చేయడంలో దీని వెనక ఏముందో అర్థమవుతుంది’ అని పేర్కొన్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.


వినుత ఇబ్బంది పెట్టింది..

‘నాపై బురద జల్లేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. డిపాజిట్లు రానివాళ్లతో నాకేంటి సంబంధం. ఈ విషయంలో ఏ రోజు కూడా నేను మీడియా సమావేశం పెట్టలేదు. వినుత గురించి ఎన్నడూ చెడుగా మాట్లాడలేదు. ఈ రోజు మాట్లాడాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం కోసం వినుత ఏనాడు పని చేయలేదు. మమ్మల్ని ఆమె ఇబ్బంది పెట్టింది. మా అమ్మ ఓటు అడిగేందుకు వెళ్తే ఇంట్లోకి కూడా రానివ్వలేదు. రాజకీయ చరిత్ర ఉన్న మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టింది. ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తే ఎవర్నీ వదిలేది లేదు. ఈ విషయంలో కచ్చితంగా విచారణ జరగాలి. ఇవాళ నాపై బురద జల్లారు, రేపు మరొకరిపై బురద జల్లుతారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు నేను ఎన్నడూ చేయలేదు. ఇవన్నీ చూస్తుంటే బాధేస్తోంది. డ్రైవర్‌ రాయుడిని హత్య చేసి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిిన తర్వాత.. చెన్నై ఎస్పీ బహిరంగంగా ప్రకటించాక కూడా వినుత ఇలా మాట్లాడుతోంది. ఇప్పుడు సెల్ఫీ వీడియోలు విడుదల చేస్తోంది. ఆమెకి బెయిల్ వచ్చినంత మాత్రనా వీళ్లు రాయుడిని హత్య చేయనట్లు కాదు. ఈ విషయంపై దర్యాప్తు జరగాలి. నేను ఏ విచారణకైనా సిద్ధమే. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఈ విషయంలో పోలీసులు చర్యలు తీసుకోవాలి’ అని కోరారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.


ఆధారాలు ఇవ్వాలి.

‘వినుతపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తాం. నేను సంజాయిషీ ఇవ్వడానికి మాట్లాడటం లేదు. శ్రీకాళహస్తి అంటే దేవుని ప్రాంతం. నేను ఉండేది శ్రీకాళహస్తిలో.. పని చేసేది శ్రీకాళహస్తి ప్రజల కోసమే. నాకు అనుమానాలు వస్తున్నాయి. వినుత ఎందుకు ఇలా చేస్తోంది. క్రిమినల్ మెంటాలిటీతో ఆమె ఉన్నారు. వినుత మా ఇంటికి రెండు సార్లు వచ్చింది. ఈ కేసులో లాయర్‌ని సంప్రదిస్తాం. ఆమె ఏం వీడియోలు పెట్టడానికి వీల్లేదు. రాయుడు ఎవరో నాకు తెలియదు. శ్రీకాళహస్తి ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. ఏమైనా ఉంటే వినుత పోలీసులకు ఆధారాలు ఇవ్వాలి. హత్య చేసిన వాళ్లే ఇలా చేస్తే ఎలా.. పోలీసులు చర్యలు తీసుకోవాలి. మా నాన్న ఎలాంటి వారో.. అందరికీ తెలుసు. మా బ్రాండ్ గురించి అందరికీ తెలుసు. మేము తప్పు చేయలేదు. ప్రధానమంత్రి నరేద్రమోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ నాకు టికెట్ల ఇచ్చారు. కూటమిలో లెక్కలు ఉంటాయి. పెద్ద వాళ్లు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకం చేయొద్దు’ అని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్

ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 13 , 2025 | 09:47 PM