PVN Madhav Counter on YS Jagan: జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమరావతి నష్టపోయింది: పీవీఎన్ మాధవ్
ABN , Publish Date - Sep 05 , 2025 | 08:36 AM
ప్రధాని మోదీ ప్రజల మనిషి అని... జనం మేలు కోసం ఎప్పుడూ ఆలోచనలు చేస్తారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. గత ఏడాది ఏపీకి పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. జాతీయ రహదారుల కనెక్టివిటి, రైలు మార్గాల పెంపుతో ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, అమరావతిలను కలుపుతూ ఓఆర్ఆర్ నిర్మాణం జరుగుతోందని పీవీఎన్ మాధవ్ తెలిపారు.
విజయవాడ, సెప్టెంబరు5 (ఆంధ్రజ్యోతి): జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమరావతి రాజధాని ప్రాంతం బాగా దెబ్బతిన్నదని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో అమరావతి (Amaravati Development) రాజధాని ప్రాంతం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతోందని ఉద్ఘాటించారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి చెందుతుందని నొక్కిచెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతిలో వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు. త్వరలోనే ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందడం అందరూ చూస్తారని చెప్పుకొచ్చారు. ప్రజలు కూడా ఆలోచనలు చేయాలని సూచించారు. అరాచక పాలన కావాలా.. అభివృద్ధి పాలన కావాలా అనే చర్చ పెట్టాలని కోరారు. ఎవరి హయాంలో ఈ దేశానికి, రాష్ట్రానికి మంచి జరిగిందో మీరే ఆలోచించాలని సూచించారు. ఆత్మ నిర్భర్ భారత్ కోసం అందరం కలిసి అడుగులు వేద్దామని పేర్కొన్నారు పీవీఎన్ మాధవ్.
ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నాం
ఇవాళ(శుక్రవారం) కృష్ణలంక సత్యంగారి హోటల్ సెంటర్‌లో చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాధవ్ పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న పలు సమస్యలను మాధవ్ దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పని తీరుపై తమ అభిప్రాయాలను ప్రజలు తెలిపారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడారు. అనేక ఆలోచనలు, చర్చల ద్వారా ఎలాంటి సమస్యకు ఆయినా పరిష్కారం దొరుకుతుందని చెప్పుకొచ్చారు. ప్రజల నాడీ, వారి సమస్యలను తెలుసుకునేందుకు తాము చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు పీవీఎన్ మాధవ్.
ప్రధాని మోదీ ప్రజల మనిషి..
‘ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలు, అక్కడి విశిష్టతను గుర్తించి వాటిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం. టీ తాగుతూ... ప్రజల ఆలోచనలు, కూటమి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలను తెలుసుకుంటున్నాం. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో కూడా చెబితే సూచనలు స్వీకరిస్తాం. ప్రజలను నేరుగా కలిసి వారి అభిప్రాయాలను, వారి ఆలోచనలు, సూచనలు తెలుసుకోవడం ద్వారా ఆ ప్రాంతానికి, రాష్ట్రానికి ఇంకా మంచి చేసే అవకాశం ఉంటుంది. జీఎస్టీ పన్నులు తగ్గించి పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉపశమనం కలిగించారు. నిత్యావసర వస్తువుల ధరలు బాగా తగ్గడం ద్వారా ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుంది. సిగరేట్, గుట్కా వంటి మత్తుపదార్థాలకు, లగ్జరీ కార్లకు మాత్రం నలభై శాతం పన్ను పెంచారు. ప్రధాని మోదీ ప్రజల మనిషి... ప్రజల మేలు కోసం ఎప్పుడూ ఆలోచనలు చేస్తారు. గత ఏడాది ఏపీకి పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జాతీయ రహదారుల కనెక్టివిటి, రైలు మార్గాల పెంపుతో ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. విజయవాడ, గుంటూరు, తెనాలి, అమరావతిలను కలుపుతూ ఓఆర్ఆర్ నిర్మాణం జరుగుతోంది. అన్ని రకాల పరిశ్రమలు ఏపీలో ఏర్పాటు అవుతున్నాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడం ద్వారా ప్రజల ఆదాయ వనరులు పెరుగుతున్నాయి. 75 వసంతాల స్వాతంత్య్ర కాలంలో ఎంతో పురోగతి సాధించాం. వచ్చే పాతికేళ్లల్లో ప్రపంచంలో మన భారతదేశం మొదటి స్థానంలో ఉండాలనేది మన లక్ష్యం. మన ప్రాంతాల్లో తయారయ్యే ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. మళ్లీ దేశ వ్యాప్తంగా స్వదేశీ ఉద్యమం ప్రారంభం కావాలి’ అని పీవీఎన్ మాధవ్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
పిన్నెల్లి సోదరులకు సుప్రీంలో తాత్కాలిక ఊరట
జీఎస్టీ సంస్కరణలు దేశానికి నిజమైన దీపావళి.. పవన్ ప్రశంసలు
Read Latest Andhra Pradesh News and National News