Temporary Relief: పిన్నెల్లి సోదరులకు సుప్రీంలో తాత్కాలిక ఊరట
ABN , Publish Date - Sep 05 , 2025 | 06:37 AM
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట రామిరెడ్డిలకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట రామిరెడ్డిలకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఇద్దరు టీడీపీ నేతల హత్య కేసులో అన్నదమ్ములకు సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర రక్షణ కల్పించింది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావు ఈ ఏడాది మే నెలలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఇద్దరూ హైకోర్టును ఆశ్రయించగా నిరాశే ఎదురైంది. హైకోర్టు తీర్పును ఆగస్టు 31న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్‌పై గురువారం జస్టిస్ విక్రమ్‌నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను సెప్టెంబరు 28కి వాయిదా వేసింది.