AP Ministers: పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల విజయంపై టీడీపీ నేతల హర్షం..
ABN , Publish Date - Aug 14 , 2025 | 05:07 PM
టీడీపీ ఘన విజయంపై ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు వెనుకబడిన తనాన్ని వదిలి అభివృద్ధిని కోరుకున్నారని తెలిపారు. గడచిన 30 ఏళ్లలో తొలిసారి పులివెందులలో నిజమైన ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలకు తెరపడింది. రెండు స్థానాలను భారీ మెజార్టీతో టీడీపీ కైవసం చేసుకుంది. ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత గడ్డపై 30 ఏళ్ల తర్వాత టీడీపీ తన జెండా ఎగరవేసింది. దీంతో పార్టీ అగ్రనేతలతో సహా ప్రతి ఒక్కరూ.. సంబరాలు చేసుకుంటున్నారు. ప్రజలు ప్రజాస్వామ్యానికి మద్దతు తెలిపారని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాస్వామ్యం గెలిచింది.. లోకేశ్
ఈ నేపథ్యంలో టీడీపీ ఘన విజయంపై ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు వెనుకబడిన తనాన్ని వదిలి అభివృద్ధిని కోరుకున్నారని తెలిపారు. గడచిన 30 ఏళ్లలో తొలిసారి పులివెందులలో నిజమైన ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. అక్కడి ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లభించిందని చెప్పారు. ఎన్నికల్లో గెలుపొందిన లతా రెడ్డి, కృష్ణారెడ్డికి అభినందనలు తెలిపారు. టీడీపీ అభ్యర్థులను గెలిపించిన స్థానిక ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలను మంత్రి లోకేశ్ తెలియజేశారు.
నారా భువనేశ్వరి హర్షం..
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచిన లతా రెడ్డికి సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఫోన్ చేశారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచినందుకు లతా రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎన్నికల నిర్వాహణ, ఫలితాలపై ఆరా తీశారు. ఈ విజయం ప్రజాస్వామ్యానికి లభించిన గెలుపని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కూటమి పట్ల ఉంచిన నమ్మకానికి ఇది నిదర్శనమని హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ కోసం కష్టపడిన ప్రతి నాయకుడికి, కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. మహిళలు రాజకీయాల్లో రాణించాలని పేర్కొన్నారు. ప్రజలతో కలిసి పనిచేస్తూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని భువనేశ్వరి దిశానిర్దేశం చేశారు.
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు..
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హర్షం వ్యక్తం చేశారు. ఎప్పుడైతే ప్రజలు స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనగలిగే వాతావరణం వచ్చిందో.. అప్పుడే చాలా పెద్ద విజయం వస్తుందని అంచనా వేశామన్నారు. వైసీపీకి డిపాజిట్ కూడా రాకుండా పులివెందుల్లో కూటమి విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నిక తర్వాత కూడా వైసీపీ నేతలు.. మళ్లీ వస్తున్నాం.. వచ్చిన తర్వాత తోలు తీస్తాం.. సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొస్తామని మాట్లాడటం సమంజసం కాదని కౌంటర్ ఇచ్చారు. కాకులు దూరని కారడవి.. చీమలు దూరని చిట్టడవి పులివెందుల అని మాట్లాడుతుంటారు. అటువంటి చోట బీటెక్ రవి ఉదయించాడని రఘురామ చెప్పుకొచ్చారు.
మంత్రి అనగాని సత్యప్రసాద్...
ఒకే.. ఒక ఉపఎన్నిక పులివెందలు కోటను బద్ధలు కొట్టిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా పులివెందుల, ఒంటిమిట్ట విజయాలపై ఆయన మాట్లాడారు. ఈ ఎన్నిక దశాబ్దాలుగా ఉన్న బానిస సంకెళ్లను తెంచేసిందని తెలిపారు. పులివెందుల గడ్డపై పసుపు జెండా ఎగిరిందని హర్షం వ్యక్తం చేశారు. సొంత ఇలాకాలో వైసీపీ అభ్యర్థి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారంటే.. ప్రజలు జగన్‌పై ఎంత కసిగా ఉన్నారో అర్థమవుతోందని చురకలు పెట్టారు. ఇది వైసీపీ ఓటమి కాదు.. జగన్ అహంకారానికి చెంపదెబ్బ అని ఘాటుగా విమర్శించారు. అవినీతి, అణచివేత, అరాచకానికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు ఈ విజయమని స్పష్టం చేశారు. మీ అరాచక నాయకత్వానికి ప్రజలు గుడ్‌బై చెప్పారు.. బైబై జగన్.. అని ఆయన ఎద్దేవా చేశారు.
మంత్రి నారాయణ..
పులివెందులలో అభివృద్ధి, సంక్షేమం గెలిచిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట ఉపఎన్నికల విజయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓటర్లు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని తెలిసి, ప్రణాళిక ప్రకారం అడ్డుకోవాలని చూశారని ఆరోపించారు. 30 ఏళ్ల తర్వాత పులివెందుల ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారని తెలిపారు. ఈ ఫలితాలతో జగన్ కు కనువిప్పు కలగాలని హితవు పలికారు. వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాలేదంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని నారాయణ విమర్శించారు.
మంత్రి డోలా.....
పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలో టీడీపీ విజయంపై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడారు. పులివెందుల ఫలితాలు ముందే తెలిసే జగన్ పిచ్చిపట్టినట్టు ప్రవర్తించాడని విమర్శించారు. సొంత ఊరిలో ప్రజలు డిపాజిట్లు లేకుండా ఓడించారంటే జగన్ ఎంత అరాచకవాదో అర్థమవుతోందని తెలిపారు. ఓడిపోయినా.. ప్రజల గొంతులు కోస్తామంటూ కార్యకర్తల్ని రెచ్చిగొడుతున్నారని విమర్శించారు. జగన్ ప్రవర్తనే అతన్ని పతనం చేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికతో పులివెందులలో వైసీపీ కూసాలు కదిలాయని అన్నారు. 4 దశాబ్దాల తర్వాత పులివెందులలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లూ.. అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలతో వైఎస్ కుటుంబం పులివెందులలో గెలుస్తోందని, ఇక నుంచి పులివెందులలో రౌడీ రాజకీయాలు చెల్లవని వార్నింగ్ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాకిస్థాన్ బెదిరింపులకు భయపడేది లేదు
బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి