CM Chandrababu: శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ వ్యాఖ్యలు.. సీఎం చంద్రబాబు ఫైర్
ABN , Publish Date - Dec 06 , 2025 | 05:22 PM
జగన్‌కు దేవుడన్నా లెక్కలేదని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలన్నా లెక్కలేదని... ఆలయాల పవిత్రత అన్నా లెక్కలేదని ధ్వజమెత్తారు. పరకామణి దొంగతనం చిన్న దొంగతనం అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ విస్తుగొలిపాయని చెప్పుకొచ్చారు.
అమరావతి, డిసెంబరు6 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని ఫైర్ అయ్యారు. ఇవాళ(శనివారం) అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో పలు కీలక అంశాలపై మాట్లాడారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి చిట్‌చాట్ చేశారు. శ్రీవారి పరకామణి దొంగతనం వ్యవహారంపై జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు మీడియా ప్రతినిధులు. పరకామణి దొంగతనం చిన్న దొంగతనం అంటూ జగన్ వ్యాఖ్యలు అందరినీ విస్తుగొలిపాయని చెప్పుకొచ్చారు. జగన్‌కు దేవుడన్నా లెక్కలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలన్నా లెక్కలేదని... ఆలయాలు పవిత్రత అన్నా లెక్కలేదని ధ్వజమెత్తారు.
ఇంతకంటే ఘోరం ఉంటుందా..?
‘జగన్ తన బాబాయి వివేకా హత్యనే సెటిల్ చేసుకుందామని చూశారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల పరకామణి చోరీని కూడా సెటిల్ చేయాలని చూశారు.. ఇంతకంటే ఘోరం ఉంటుందా? దొంగతనాన్ని కూడా తప్పు కాదని చెప్పే వాళ్లను ఏమనాలి.? సెంటిమెంట్ విషయాల్లో కూడా సెటిల్‌మెంట్ అంటూ వ్యాఖ్యాలా.? దొంగతనం చేసిన వ్యక్తి డబ్బులు తిరిగి కట్టాడు కదా...తప్పేముందని జగన్ అత్యంత అనైతికంగా వాదిస్తున్నారు. భక్తులు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో ప్రతి అంశంలోనూ భక్తుల సెంటిమెంట్ ముడిపడి ఉంటుంది.
అలాంటి సున్నిత అంశాలను కూడా సెటిల్‌చేశామని తేలికగా జగన్ మాట్లాడుతున్నారు. భక్తుల ఇచ్చిన కానుకలు, ముడుపులను కొట్టేసిన దొంగలతో సెటిల్‌మెంట్ ఏంటి? శ్రీవారి హుండీలో చోరీపై జగన్ చేసిన వ్యాఖ్యలపై అన్నివర్గాల ప్రజల్లోనూ తీవ్ర ఆవేదన కనిపిస్తోంది. వర్గాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ఆ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. రూ.72 వేలు అనేది చిన్న దొంగతనమని చెబుతున్నాడు. దేవుడు హుండీలో చోరీ చిన్న తప్పా? దాన్ని సెటిల్ చేయడం మహాపాపం కాదా? కోట్ల మంది భక్తుల విశ్వాసాలు దెబ్బతీసేలా పరకామణి విషయంలో జగన్ ఇలాంటి వ్యాఖ్యలు ఘోర పాపం కాదా’ అని సీఎం చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు.