Share News

ఏపీలో పలు జలాశయాలకు పెరిగిన వరద.. అధికారుల అలర్ట్

ABN , Publish Date - Sep 25 , 2026 | 07:58 AM

వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జలాశయాలకు వరద ప్రవాహం పెరిగింది. వరద ఉద్ధృతి పెరగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో ప్రజలు జలాశయాల వద్దకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.

ఏపీలో పలు జలాశయాలకు పెరిగిన వరద.. అధికారుల అలర్ట్
AP Flood Alert

అమరావతి, సెప్టెంబర్ 25 (ఆంధ్రజ్యోతి): దక్షిణ ఒడిశా భూభాగంపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర వాయవ్య దిశగా వాయుగుండం కదులుతోందని తెలిపారు. రేపు(శనివారం) ఉదయానికి వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. వాయుగుండం ప్రభావంతో ఇవాళ (శుక్రవారం), రేపు (శనివారం) ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వివరించారు. నేడు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల అతిభారీ వర్షాలు పడతాయని తెలిపారు.


బుడమేరుకు పెరిగిన వరద ఉద్ధృతి..

బుడమేరుకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. నందివాడ మండలంలో ప్రమాద స్థాయిలో ప్రవాహం ఉంది. బుడమేరు పరివాహక పంట పొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పుట్టగుంట, బుడమేరు వంతెనపై అడుగు ఎత్తున వరద ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా నీరు వస్తోంది. వంతెన వద్ద వరదకు అడ్డుగా గుర్రపుడెక్క చేరడంతో ప్రొక్లైనర్లతో అధికారులు తొలగిస్తున్నారు. ఎగువ నుంచి గుర్రపుడెక్క భారీగా కొట్టుకువస్తోంది. దీంతో ప్రవాహానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద ప్రవాహం తగ్గకుంటే గుడివాడ - హనుమాన్ జంక్షన్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.


ప్రకాశం బ్యారేజ్‌కు పెరుగుతున్న వరద..

విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌కి వరద పెరుగుతోంది. బ్యారేజ్ గేట్లు ఎత్తి 36,250 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. వాయుగుండం కారణంగా ఎగువన కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగుతున్నాయి. కీసర, మున్నేరు, వంటి పలు వాగులు, పొంగి ప్రవహిస్తున్నాయి. బ్యారేజ్‌కు ఎగువ నుంచి 40,521 క్యూసెక్కుల వరద నీరు చేరింది. కృష్ణా పశ్చిమ డెల్టాకు 4,012 క్యూసెక్కులు, గుంటూరు చానెల్‌కు 239 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మిగిలిన వరదను గేట్లు ఎత్తి సముద్రంలోకి అధికారులు విడుదల చేశారు.


ఏలూరు జిల్లాలో భారీ వర్షపాతం నమోదు..

ఏలూరు జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా 217.5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. సరాసరిగా 7.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఐదు మండలాల్లో పది సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. అధికంగా చింతలపూడి మండలంలో 16.2 సెంటీమీటర్లు, అత్యల్పంగా జంగారెడ్డిగూడెంలో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది.

గుబ్బల మంగమ్మ ఆలయం మూసివేత..

ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం గుబ్బల మంగమ్మ ఆలయం వద్ద కొండవాగు పొంగుతోంది. గత మూడురోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు దేవాలయం వద్దకు వరద ఉద్ధృతంగా వస్తోంది. భక్తులు ఎవరూ గుబ్బల మంగమ్మ ఆలయ దర్శనానికి రావద్దని కమిటీ సభ్యులు సూచించారు. ఆలయాన్ని మూసివేశారు.


వంశధార, నాగావళి నదులకు పెరిగిన వరద ఉద్ధృతి..

భారీ వర్షాలతో వంశధార, నాగావళి నదులకు వరద ఉద్ధృతి పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ తెలిపారు. వంశధార వరద ప్రవాహం పెరగడంతో గొట్టా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 41,014 క్యూసెక్కులు ఉందని తెలిపారు. నాగావళి వరద ప్రవాహం పెరగడంతో తోటపల్లి వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 45,661 క్యూసెక్కులు ఉంది. నారాయణపురం అనకట్ట వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 59,700 క్యూసెక్కులు ఉంది. అత్యవసర సహాయక చర్యలకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నదిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి ప్రమాదకరమని ప్రఖర్ జైన్ హెచ్చరించారు.


పార్వతీపురం మన్యం జిల్లాలో తోటపల్లి జలాశయానికి పెరిగిన వరద ముప్పు

పార్వతీపురం మన్యం జిల్లాలో తోటపల్లి జలాశయానికి వరద ముప్పు పెరిగింది. వరద ముప్పు పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నాగావళికి వరద ఉద్ధృతి పెరగడంతో 40,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ఒడిశాలో వర్షాలతో తోటపల్లి బ్యారేజీ ఉప్పొంగుతోంది. నదిలోకి దిగవద్దని, కాజ్‌వేలు దాటవద్దని కలెక్టర్ ప్రభాకరరెడ్డి అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. ఎగువన కురిసిన వర్షాలతో గుమిడి గెడ్డకు భారీగా వరద నీరు చేరింది. వరద పెరగడంతో కురుపాం నియోజకవర్గంలో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.


విజయనగరం జిల్లాలోని నాగవళి నదిలో పెరిగిన వరద ప్రవాహం..

విజయనగరం జిల్లాలోని నాగవళి నదిలో వరద ప్రవాహంపై కలెక్టర్‌ రాంసుందర్‌ రెడ్డి పర్యవేక్షించారు. కంట్రోల్‌ రూమ్‌ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నాగావళి ప్రవాహం 60 వేల క్యూసెక్కులు దాటే అవకాశం ఉందని తెలిపారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు. నాగావళి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వంగర, సంతకవిటి, రేగిడి మండలాల అధికారులు అలర్ట్‌గా ఉండాలని దిశానిర్దేశం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


నేడు పాఠశాలలకు సెలవులు..

విశాఖపట్నం నగర పరిధిలో గత మూడు రోజులుగా కురిసిన వర్షాలతో జలాశయాలు, నీటితో కళకళలాడుతున్నాయి. ఇవాళ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలోని పాఠశాలలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తీవ్ర వాయుగుండం.. 24x7 అత్యంత అప్రమత్తంగా ఉండాలి: మంత్రి జనార్దన్ రెడ్డి

వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు

వైసీపీకి భారీ షాక్.. కీలక నేతల రాజీనామా

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 25 , 2026 | 08:40 AM