వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు
ABN , Publish Date - Sep 24 , 2026 | 12:43 PM
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈడీ విచారణకు A2 నిందితుడు సునీల్ యాదవ్ హాజరయ్యారు.
కడప, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy Case) ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈడీ విచారణకు A2 నిందితుడు సునీల్ యాదవ్ హాజరయ్యారు. వివేకా హత్య ముందు, హత్య తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను ఈడీకి సునీల్ యాదవ్ అందజేశారు. ఈ హత్యకు రూ.40కోట్ల ఫండింగ్, రూటింగ్‌పై ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు.
వివేకా హత్యతో నాకు సంబంధం లేదు: సునీల్ యాదవ్
ఈడీ అధికారుల విచారణ అనంతరం వివేకా హత్య కేసులో A2 నిందితుడు సునీల్ యాదవ్ ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఈ కేసు విచారణలో సీబీఐకు సహకరించినట్లే, ఈడీకి కూడా సహకరిస్తానని స్పష్టం చేశారు. వివేకా కేసులో తాను వైట్ పేపర్ లాంటి వాడినని.. ఈ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. వైసీపీ హయాంలో తాను అణిచివేతకు గురయ్యానని చెప్పుకొచ్చారు. వివేకా హత్యకు ముందు, ఆ హత్య తర్వాత జరిగిన లావాదేవీల గురించి అధికారులు అడిగారని తెలిపారు. బ్యాంక్ స్టేట్‌మెంట్స్‌తో పాటు తాను ఈడీ అధికారుల విచారణకు హాజరయ్యానని తెలిపారు. ఈడీ ఎప్పుడు విచారణకు ఆదేశించినా తాను సహకరిస్తానని అన్నారు. ఈ హత్య కోసం రూ.40 కోట్ల ఫండింగ్, రూటింగ్ అనేది తనకు తెలియదన్నారు. వివేకా హత్య కోసం రూ.40 కోట్ల డీల్ జరిగి ఉండవచ్చని, కానీ ఈ హత్యతో తనకు సంబంధమే లేదని.. తనకు డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఈ హత్య కేసుతో మానసికంగా, ఆర్థికంగా తాను చాలా దెబ్బ తిన్నానని పేర్కొన్నారు. ఈ కేసును ఎంత వీలైతే అంత త్వరగా విచారణ జరిపి పూర్తి చేయాలని సునీల్ యాదవ్ కోరారు.
ఈడీ అధికారుల నోటీసులు
అలాగే, వివేకా హత్య కేసులో A1 ఎర్ర గంగిరెడ్డి, A3 ఉమాశంకర్ రెడ్డికి ఈడీ అధికారులునోటీసులు అందజేశారు. ఈ నెల 27, 28వ తేదీల్లో హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో అప్రూవల్ దస్తగిరిని, సునీల్ యాదవ్‌ని ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
తుఫాన్ వేళ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
భారీ వర్షాల వేళ విజయవాడ కొండ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి: మంత్రి నారాయణ
తుఫాన్ వేళ ప్రజా రవాణాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలి: మంత్రి జనార్దన్ రెడ్డి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News