Share News

అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో వర్షాలు..

ABN , Publish Date - May 14 , 2026 | 04:02 PM

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 16వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులకు చేరుకోవడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు.

అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో వర్షాలు..
AP Rain Alert

విశాఖపట్నం జిల్లా, మే14, (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 16వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులకు చేరుకోవడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. ఇది రానున్న 48 గంటల్లో ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉందని వెల్లడించారు.


ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం..

తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని జగన్నాథ్ కుమార్ వివరించారు. అలాగే ఈ అల్పపీడనం నుంచి ఉత్తర తమిళనాడు, రాయలసీమ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మధ్య మహారాష్ట్ర వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని వెల్లడించారు. మధ్యప్రదేశ్ నుంచి మధ్య మహారాష్ట్ర, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు మరో వాతావరణ వ్యవస్థ సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని పేర్కొన్నారు.


ఐదు రోజుల పాటు వర్ష సూచన..

ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని జగన్నాథ్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిడుగులు పడే అవకాశాలు ఉండటంతో ప్రజలు చెట్ల కింద నిలబడకూడదని హెచ్చరించారు.


కర్నూలులో భారీ ఉష్ణోగ్రతలు..

గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు జగన్నాథ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ, వర్షాల ప్రభావంతో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు కొంత తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.


రైతులకు సూచనలు..

వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని జగన్నాథ్ కుమార్ సూచించారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను రక్షించుకోవాలని అన్నారు. ధాన్యం తడవకుండా గోదాముల్లో నిల్వ చేయాలని అన్నారు. పిడుగులు పడే సమయంలో పొలాల్లో పని చేయకూడదని చెప్పుకొచ్చారు. పశువులను సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని అన్నారు.


మత్స్యకారులకు హెచ్చరిక..

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నందున సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

దుబారా ఖర్చులను తగ్గిద్దాం.. సీఎం చంద్రబాబు పిలుపు

ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం.. భారత్‌నెట్ అమలుకు చరిత్రాత్మక ఒప్పందం

నా కస్టోడియల్ టార్చర్ కేసును వదిలే ప్రసక్తే లేదు: రఘురామ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 14 , 2026 | 04:11 PM