రైతులకు ఏఐ అండ.. ‘భారత్ విస్తార్’ యాప్
ABN , Publish Date - Sep 30 , 2026 | 01:50 PM
వ్యవసాయ రంగంలోనూ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.
వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధ వినియోగం
అన్నదాతల కోసం ‘భారత్ విస్తార్’ యాప్
సాగు పద్ధతులపై సంపూర్ణ సమాచారం
చీడపీడల నివారణపై సూచనలు
ప్రాంతీయ భాషల్లోనూ యాప్ సేవలు
సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు
వ్యవసాయ రంగంలోనూ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. రైతులు సైతం స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తుండడంతో వ్యవసాయంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకుంనేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)ను వ్యవసాయ రంగంలోనూ వినియోగిస్తున్నారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘భారత్ విస్తార్’ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా కేవలం సలహాలు, సూచనలు మాత్రమే కాకుండా విత్తనాలు, సాగు పద్ధతులు, చీడపీడల నివారణ, యాజమాన్య పద్ధతులు, పంటలకు మద్దతు ధర ఎక్కడ లభిస్తుంది, మార్కెట్ సౌకర్యాలు తదితర అంశాల గురించి తెలుసుకునే వీలుంది.
రంగారెడ్డి: జిల్లాలో మొత్తం 27మండలాల్లో రైతులు పలు రకాల పంటలను సాగుచేస్తారు. జిల్లాలో ఈ వానాకాలంలో ఐదు లక్షల ఎకరాల్లో పలు రకాల పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేయగా ఇప్పటివరకు 3.61లక్షల ఎకరాల్లోనే పంటలు సాగవుతున్నాయి. వీటిలో 1.37లక్షల ఎకరాల్లో వరి, 1.61 ఎకరాల్లో పత్తి, కూరగాయలు, ఉద్యానవన, తదితర పంటలను సాగు చేశారు.
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులకు యాప్‌ల ద్వారా వాతావరణ పరిస్థితులు, పంటల సాగు, మార్కెటింగ్‌కు సంబంధించిన అన్ని అంశాలను వెల్లడించేందుకు ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. పంపుసెట్లు, నిఘా నేత్రాల నిర్వహణ, ఎరువులు, విత్తనాల కొనుగోలు, ఇతర అవసరాలకు రైతులు సెల్‌ఫోన్‌ను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం విస్తార్ యాప్‌తో రైతన్నలు సెల్‌ఫోన్‌ను మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దుకునే అవకాశం కలిగింది. ప్రాంతీయ భాషలో యాప్ సేవలు లభ్యమవుతుండటం వారికి మరింత అనుకూలంగా మారింది.
యాప్ సేవలు ఇలా..
రైతన్న తన పంట పొలంలో నిలబడి పంటకు ఆశించిన చీడపీడ, తెగులుకు సంబంధించిన ఫొటో తీసి పంపిన వెంటనే ఆ రోగమేమిటి, ఏ మందు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి? తదితర వివరాలు క్షణాల్లో అందిస్తుంది. రైతు తాను సాగు చేయాలనుకున్న పంట వివరాలు అందిస్తే మేలైన వితనాలు ఎక్కడ లభిస్తాయి, ఎంత విత్తనం అవసరం అనే వివరాలు అందిస్తుంది. ఏ పంట అయినా చేతికందిన తర్వాత మార్కెట్లో అమ్మితే లాభాలు వస్తాయో తెలుపుతుంది.
ఏ కాలంలో ఏ పంట సాగు చేయాలో వాతావరణ పరిస్థితులను అంచనావేసి చెబుతుంది. ఈదురుగాలులు, భారీ వర్షాలు, వడగండ్లు తదితర వాతావరణ సూచనలందించి పంటనష్టం కాకుండా కాపాడుతుంది. సారవంతమైన నేలలు ఉన్న జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలతోపాటు ఇతర వాణిజ్య పంటలు సాగు చేస్తున్న రైతులు ఈ యాప్‌ను వినియోగిస్తే అధిక ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
ఇప్పటికే అందుబాటులో యాప్‌లు
సాగులో రైతులకు అవసరమయ్యే సలహాలు, సూచనలతోపాటు వ్యవసాయ సమాచారం పక్కాగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక యాప్‌లు వినియోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు యాప్‌లతో స్మార్ట్‌గా వ్యవసాయం చేసుకునే వీలు కల్పిస్తున్నాయి. పంటలు సాగుపై ఏఐ, ఇంటర్నెట్, ఆప్ థింగ్స్, డ్రోన్ రోబోటిక్స్‌పై ఇప్పటికే రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు. ఎరువుల నియంత్రణతో పాటు అవసరం మేరకు ఎరువులు అందేలా కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఎ్‌ఫఎ్‌స(ఫ్రేం వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్)పేరుతో యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
వాతావరణం, వర్ష సూచన తేమ, ఎండ, తుఫాన్ తదితర సమాచారం తెలుసుకునేందుకు వీలుగా మౌసం, మేఘదూత్ యాప్‌లు పని చేస్తున్నాయి. జాతీయ చీడపీడల నిఘా వ్యవస్థ ద్వారా నేషనల్ పెస్ట్ సర్వ్యేలైన్స్ సిస్టం పేరిట మొబైల్‌యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో రైతులకు సాగు సలహాలు అందేలా కేవీకే శాస్త్రవేత్తలు అన్నపూర్ణ కృషి ప్రసార్ యోజన కింద పేర్లు నమోదు చేసుకున్న రైతుల సెల్‌ఫోన్లకు సమాచారం చేరవేస్తున్నారు. వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు రైతులకు వాయిస్ మేసేజ్‌లు చేరవేస్తారు. సేంద్రియ రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం టీజీ ఆర్గానిక్స్ పేరిట యాప్ ప్రవేశపెట్టింది. కిసాన్ సంచార్, గ్రామ ఫోన్ అనే యాప్‌ల ద్వారా పంటల సంరక్షణ, దిగుబడికి సంబంధించిన సలహాలు సూచనలు పొందవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల ఆర్చరీ జట్టుకు స్వర్ణం.. మంత్రి మండిపల్లి అభినందనలు
త్వరలో రెండో విడత నామినేటెడ్ పదవుల భర్తీ: పల్లా శ్రీనివాసరావు
Read Latest AP News And Telangana News And International News And Telugu News