దుబాయ్–టెల్ అవీవ్ విమానంలో హైజాక్ సంకేతాలు.. ఫైటర్ జెట్లతో ఇజ్రాయెల్ అలర్ట్
ABN , Publish Date - Sep 30 , 2026 | 01:04 PM
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో హైజాక్ అలర్ట్ కలకలం రేపింది. విమానం నుంచి అత్యవసర సంకేతాలు రావడంతో ఇజ్రాయెల్ అధికారులు అప్రమత్తమై ఫైటర్ జెట్లను రంగంలోకి దించారు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో హైజాక్ అలర్ట్ కలకలం రేపింది. ఫ్లైదుబాయ్‌కు చెందిన FZ1073 విమానం బుధవారం సౌదీ అరేబియా గగనతలం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో రెండు అత్యవసర కోడ్‌లను ప్రసారం చేసినట్లు ఇజ్రాయెల్ మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అందులో ఒక కోడ్ విమానాన్ని హైజాక్ చేసే అవకాశం ఉందన్న సంకేతాన్ని ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఇజ్రాయెల్ అధికారులు అప్రమత్తమై పరిస్థితిని పర్యవేక్షించారు. ముందస్తు జాగ్రత్తగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను రంగంలోకి దించినట్లు నివేదికలు వెల్లడించాయి. విమానంలో ఉన్న ప్రయాణికులు.. సిబ్బంది భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
హైజాక్ అనుమానాస్పద సంకేతాల నేపథ్యంలో FZ1073 విమానాన్ని టెల్ అవీవ్‌కు వెళ్లకుండా సౌదీ అరేబియాకు మళ్లించినట్లు సమాచారం. ఈ పరిణామంతో ఇజ్రాయెల్‌లో భద్రతా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించగా.. అత్యవసర కోడ్‌లు ఎందుకు ప్రసారమయ్యాయి, వాటి వెనుక అసలు కారణం ఏంటన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ అత్యవసర భద్రతా సమావేశం నిర్వహించినట్లు ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. అయితే.. విమానం నుంచి హైజాక్ సంకేతాలు రావడానికి దారితీసిన పూర్తి కారణాలు.. ఆ సమయంలో విమానంలో వాస్తవంగా ఏం జరిగిందన్న దానిపై అధికారులు అధికారికంగా మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి...
డేటింగ్ యాప్‌లో పరిచయం.. పబ్‌లో రూ.29,884 బిల్లు!
స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిచెప్పిన పోరాటం ‘సాగరహారం’: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News