నవంబరు 10 నుంచి పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు
ABN , Publish Date - Sep 30 , 2026 | 12:44 PM
రేణిగుంట రైల్వేస్టేషన్ యార్డ్ ఆధునీకరణ పనుల్లో భాగంగా రైలు మార్గాలను అనుసంధానం చేస్తున్న కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు రైల్వేశాఖ ప్రకటించింది.
తిరుపతి: రేణిగుంట రైల్వేస్టేషన్ యార్డ్ ఆధునీకరణ పనుల్లో భాగంగా రైలు మార్గాలను అనుసంధానం చేస్తున్న కారణంగా నవంబరు 10నుంచి డిసెంబరు 27వ తేది వరకు పలు రైళ్లను రద్దు చేస్తూ, మరికొన్ని రైళ్లను దారి మళ్లించనున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే జోనల్ అధికారి విజయ్‌కిషన్ తెలిపారు. రేణిగుంట - నిశ్చింతపూర్ మధ్య వస్తు రవాణా చేసే నాలుగు రైళ్లను రద్దు చేశారు. రోజువారీగా రాకపోకలు సాగించే కడప - అరక్కోణం, తిరుచానూరు - అరక్కోణం, చెన్నై - తిరుచానూరు, గూడూరు - రేణిగుంట, నెల్లూరు - రేణిగుంట మధ్య రోజువారీ రాక పోకలు నిర్వహించే ప్యాసింజర్ రైళ్లను 48 రోజుల పాటు రద్దు చేశారు.
అలాగే చెన్నై - తిరుపతి మధ్య రోజువారీగా రాకపోకలు నిర్వహించే సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ను 27 రోజులు రద్దు చేశారు. తిరుపతి, తిరుచానూరు, రేణిగుంట నుంచి రాకపోకలు నిర్వహించే పలు ఎక్స్‌ప్రెస్‌లను కొద్ది రోజులు రద్దు చేశారు. తిరుపతి - విశాఖపట్టణం మధ్య వారంలో మూడు రోజులు నడుస్తున్న డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌ను డిసెంబరు 9 నుంచి 26వ తేది వరకు ఆది, సోమ, బుధ, గురు, శుక్ర, శనివారాల్లో రద్దు చేశారు.
అలాగే తిరుచానూరు నుంచి నాందేడ్, జాల్నా, కాచిగూడ, చర్లపల్లి మధ్య రాకపోకలు నిర్వహించే వారాంతరం ఎక్స్‌ప్రెస్ రైళ్లను రెండు రోజులు రద్దు చేశారు. అలాగే రేణిగుంట - మైసూరు మధ్య నడుస్తున్న ఎక్స్‌ప్రెస్‌ను డిసెంబరు 11, 12, 18, 19, 25, 26 తేదీల్లో రద్దు చేశారు. తిరుపతి - భువనేశ్వర్ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలును డిసెంబరు 12, 13, 14, 19, 20, 21, 26, 27 తేదీల్లో రద్దు చేశారు.
73 ఎక్స్‌ప్రెస్ రైళ్ల దారి మళ్లింపు
రేణిగుంట మీదుగా ముంబాయి, హౌరా, ఢిల్లీ, కన్యాకుమారి. చెన్నై, త్రివేండ్రం, బెంగళూరు, మైసూరుకు నడిచే రైళ్లను దారి మళ్లించారు. ఇందులో కొన్ని రైళ్లు గుత్తి, ధర్మవరం, మీదుగా, మరికొన్ని రైళ్లు గూడూరు పెరంబూరు మీదుగా నడుస్తాయి. రేణిగుంట నుంచి నిజాముద్దీన్ వరకు వెళ్లే దూద్ దొరొంతో పాల రవాణా చేసే రైలు రేణిగుంట నుంచి ఎర్రగుంట్ల, నంద్యాల, గుంటూరు, విజయవాడల మీదుగా నడుస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల ఆర్చరీ జట్టుకు స్వర్ణం.. మంత్రి మండిపల్లి అభినందనలు
త్వరలో రెండో విడత నామినేటెడ్ పదవుల భర్తీ: పల్లా శ్రీనివాసరావు
Read Latest AP News And Telangana News And International News And Telugu News