ఎండుతున్న వరి.. వాడుతున్న పత్తి
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:16 PM
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా.. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతన్నల ఆశలు సన్నగిల్లుతున్నాయి.
మొహం చాటేసిన వరుణుడు
ఆందోళనలో రైతులు
కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలని వేడుకోలు
ఎల్‌నీనో ప్రభావం, వరుణుడి ముఖం చాటేయడంతో, ఎండల తీవ్రతకు పత్తి చేన్లు వాడిపోతుండగా, వరి పంటలు ఎండుముఖం పట్టాయి. ఇప్పటికే ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతన్నలు.. పెట్టిన ఖర్చు బూడిదలో పోసిన పన్నీరు అవుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తపా్‌సపల్లి రిజర్వాయర్ ద్వారా కాలువలకు సాగునీరు విడుదల చేసి తమను ఆదుకోవాలని అన్నదాతలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
సిద్దిపేట: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా.. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతన్నల ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఒకవైపు వానలు కురవకపోగా, మరోవైపు ఎండల తాకిడి విపరీతంగా పెరగడంతో పత్తి, వరి పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి.
ఎల్‌నీనో ప్రభావం కారణంగా జూన్, జూలై, ఆగస్టు నెలల్లో వాన మబ్బులు వచ్చినా ఆశించిన వర్షాలు పడలేదు. ఈ వానాకాలం సీజన్‌లో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. రోహిణీ కార్తెలో కురిసిన అడపా దడపా వర్షాలకు రైతులు పత్తి విత్తనాలు నాటారు. అయితే, దుక్కి దున్ని, విత్తనం నాటి, కలుపు తీసి, మందులు వేసే వరకు ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టారు.
జూన్ నుంచి సెప్టెంబరు మొదటి వారం వరకు వరుణుడు ముఖం చాటేయడం, భానుడు ప్రతాపం చూపడంతో పత్తి చేన్లు వాడిపోయి పూత, పిందె రాలిపోతోంది. వ్యవసాయ శాఖ హెచ్చరికలతో కొందరు బోర్లు, బావుల కింద వరి సాగు చేసినా.. వర్షాలు లేక బోర్లు కూడా తక్కువగా పోస్తున్నాయి. వర్షాలు కురవకపోతే భవిష్యత్తులో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి, బోర్లు వట్టిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
తపాస్‌పల్లి రిజర్వాయర్‌పైనే రైతన్నల ఆశలు
రైతులకు తపా్‌సపల్లి రిజర్వాయరే సాగునీటి కల్పవల్లిగా మారింది. తపా్‌సపల్లి రిజర్వాయర్ పరిధిలోని సబ్ డివిజన్ (కొమురవెల్లి, చేర్యాల, మద్దూరు, బచ్చన్నపేట, కొండపాక) రైతులు పూర్తిగా ఈ రిజర్వాయర్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. కొన్ని రోజులుగా వర్షాలు జాడలేకపోవడంతో వరి, పత్తి పంటలు ఎండిపోతున్నాయి. ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి రెండు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్‌ను నింపాలని, కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.
అప్పులు మిగిలేలా ఉన్నాయి
జూన్‌లో రోహిణీ కార్తెలో కురిసిన వర్షాలతో 1.20 ఎకరంలో పత్తిని సాగు చేశా. చేతికి వచ్చే సమయంలో వర్షాలు లేక ఎండ తీవ్రతకు చేను వాడిపోతోంది. పూత, పిందె రాలిపోతుండటంతో గత ఏడాది మాదిరిగా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. పెట్టిన పెట్టుబడితో పాటు ఆరుగాలం శ్రమ భూమిపాలై, తీవ్రంగా నష్టపోయి అప్పులపాలవుతామనే దిగులు పట్టుకుంది.
పుట్ట అబ్బయ్య, రైతు పందిల్ల
నీటిని విడుదల చేసి ఆదుకోండి
తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలి. వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి. ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నీటిని విడుదల చేసేలా చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలి.
దాసరి శ్రీనివాస్, రైతు, లెనిన్‌నగర్ గ్రామం
ఈ వార్తలు కూడా చదవండి:
‘ఇందిరమ్మ’ లాటరీలో ఇళ్లురాని వారికి ధరావతు వాపస్
Read Latest AP News And Telangana News And International News And Telugu News