‘ఇందిరమ్మ’ లాటరీలో ఇళ్లురాని వారికి ధరావతు వాపస్
ABN , Publish Date - Sep 09 , 2026 | 07:53 AM
ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ పథకంలో లాటరీలో ఇళ్లు రాని దరఖాస్తుదారులకు ధరావత్‌ను బుధవారం నుంచి తిరిగి చెల్లిస్తున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి. గౌతమ్ తెలిపారు.
ఆన్‌లైన్ చెల్లింపులు చేసిన వారు దరఖాస్తు చేయొద్దు..
నగదు చెల్లింపులు చేస్తే రేపటిలోగా దరఖాస్తు చేయాలి..
నాలుగు సెగ్మెంట్లలో ఇళ్లకు కొత్త దరఖాస్తులు రేపటిలోగా చేయాలి
హైదరాబాద్ సిటీ: ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ పథకంలో లాటరీలో ఇళ్లు రాని దరఖాస్తుదారులకు ధరావత్‌ను బుధవారం నుంచి తిరిగి చెల్లిస్తున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి. గౌతమ్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు దరఖాస్తు చేసిన సమయంలో ధరావతు (ఈఎండీ)గా ఆన్‌లైన్ ద్వారా రూ. 10 వేలు హౌసింగ్‌బోర్డు స్వీకరించింది. ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించిన వారు ధరావత్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.
దరఖాస్తుదారులు ఏ అకౌంట్ నుంచి ఈ మొత్తాన్ని చెల్లించారో అదే అకౌంట్‌కు డబ్బు జమ చేస్తామని ఆయన వివరించారు. వారం రోజుల్లోగా ఈ చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు. కొంతమంది దరఖాస్తుదారులు మీ-సేవా కేంద్రాల్లో నగదు రూపంలో చెల్లించినట్లు గుర్తించామని, వారికి డబ్బు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
నగదు చెల్లింపులు చేసిన వారు హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tghb.telangana.gov.in ద్వారా ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా, లాటరీ ద్వారా ఎంపికైన వారి వివరాల పరిశీలన కొనసాగుతుందని, ఈ ప్రక్రియ పూర్తికావడానికి మరికొన్ని రోజుల సమయం పడుతుందని ఆయన తెలిపారు. ఇతర సందేహాలకు కాల్ సెంటర్ నంబర్ 040- 24603572కు ఫోన్ చేయవచ్చని సూచించారు.
దరఖాస్తులకు రేపే ఆఖరు
చాంద్రాయణగుట్ట, ఎల్‌బీనగర్, ముషీరాబాద్, గోషామహల్ నియోజకవర్గాల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ పథకంలో దరఖాస్తుల స్వీకరణ ప్రస్తుతం కొనసాగుతుంది. దరఖాస్తులను ఈనెల 10వ తేదీ వరకు సమర్పించవచ్చని హౌసింగ్‌బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం ధరల్లో ఊగిసలాట.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News