ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ రాకేశ్ మెహతా ఆత్మహత్య
ABN , Publish Date - Sep 09 , 2026 | 06:47 AM
ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ రాకేశ్ మెహతా (74) ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ రాకేశ్ మెహతా (74) ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. పోలీసులు తెలిపిన ప్రాథమిక దర్యాప్తు వివరాల మేరకు.. రాకేశ్ మెహతా నోయిడా సెక్టార్-82లోని కేంద్రీయ విహార్-2 సొసైటీలోని అద్దె ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంటున్నారు. రాకేశ్ భార్య, కుమారుడు డెహ్రాడూన్‌లో ఉంటున్నారు. ఆయన శనివారం రాత్రి తన భార్యతో ఫోన్‌లో మాట్లాడారు. ఆదివారం మధ్యాహ్నం కుటుంబసభ్యులు ఫోన్ చేసినప్పుడు ఆయన లిఫ్ట్ చేయలేదు. పదే పదే ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవటంతో వారికి అనుమానం వచ్చింది.
సొసైటీ సెక్యూరిటీ గార్డులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వారు ఫ్లాట్‌కు వెళ్లి చూడగా రాకేశ్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించారు. సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫ్లాట్ దగ్గరకు చేరుకున్న పోలీసులు రాకేశ్ శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు ఫ్లాట్‌లో రాకేశ్ రాసినట్లుగా భావిస్తున్న ఓ సూసైడ్ నోట్ లభించింది. మానసిక, శారీరక అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ సూసైడ్ నోట్‌లో ఉంది.
కాగా, 1975 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి రాకేశ్ మెహతా.. మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హయాంలో 2007 నుంచి 2010 వరకు ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా సేవలందించారు. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీలో కీలకమైన రవాణా, విద్యుత్, మౌలిక వసతుల ప్రాజెక్టుల అమలులో తన వంతు కృషి చేశారు. గతంలో ఎంసీడీ కమిషనర్‌గా, ఢిల్లీ ఎన్నికల కమిషనర్‌గా పనిచేశారు.
ఇవి కూడా చదవండి
వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు