పక్కా ప్రణాళికతోనే పోలీసులపై దాడి
ABN , Publish Date - Sep 09 , 2026 | 06:51 AM
శాసనసభ వద్ద సోమవారం ఉదయం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరుపై పోలీసుల ఫిర్యాదుతో మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
మీడియా ఉన్న చోటు ఎంపిక
చేసుకునే బీఆర్‌ఎస్ నేతల హంగామా
స్పీకర్ కులం తెలిసే అవమానించారు
మహిళా పోలీసుల ముందు అసభ్యప్రవర్తన.. పోలీసులపై దాడి యత్నం
బీఆర్‌ఎస్ నేతలపై పోలీసుల ఫిర్యాదు.. మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు
హైదరాబాద్, సెప్టెంబర్ 8(ఆంధ్రజ్యోతి): భద్రతా సిబ్బందిపై దాడి, దూషణలు, మహిళా పోలీసులను అవమానించేలా ప్రవర్తించడం, దళితుడని తెలిసే స్పీకర్‌ను దూషించడం.. అంతా పక్కా పథకం ప్రకారమే జరిగిందంటూ కేసులు నమోదు చేశారు. ఘర్షణ జరిగిన సమయంలో విధి నిర్వహణలో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక ఎఫ్‌ఐఆర్‌లో వివరాలు నమోదు చేశారు. ‘బీఆర్‌ఎస్ నాయకులు హరీశ్‌రావు, కేటీఆర్, సుధీర్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి తదితరులు అసెంబ్లీ గేటు వద్దకు నినాదాలు ముద్రించిన నల్లచొక్కాలు ధరించి వచ్చారు. రాజకీయ నినాదాలు ఉన్న చొక్కాలు ధరించిన వారికి లోపలికి అనుమతి లేదని, సహకరించాలని కోరాం. హరీశ్‌రావు మహి ళా కానిస్టేబుళ్లను అడ్డంపెట్టుకుని చవకబారు రాజకీయాలు చేస్తున్నారా? అని బిగ్గరగా అరిచారు. అదే సమయంలో కేటీఆర్ కూడా మహిళలను అడ్డు పెట్టుకుని సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నది ఎవరు? ఇక్కడ డీసీపీ ఎవరు? అని అవమానించారు. ఈ వ్యాఖ్యలు మహిళా పోలీసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి. తర్వాత హరీశ్‌రావు చొక్కాను విప్పి ఒక పోలీసు అధికారివైపు విసిరి, అర్ధనగ్నంగా నిలబడ్డారు. నవీన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి తదితరులు చొక్కాలు విప్పి మహిళా పోలీసులకు అత్యంత సమీపంలో నిలబడ్డారు. మేం తీవ్ర అసౌకర్యానికి, మానసిక వేదనకు గురయ్యాము. ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి మహిళా పోలీసులను ఎక్కడ పెడతారని అరిచారు. మహిళా పోలీసులను నెడుతూ ఛాతీభాగంపై ఒత్తిడి కలిగించడంతో.. నొప్పితో ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా హరీశ్‌రావు తదితరులపై బీఎన్‌ఎ్‌సలోని 74, 75(1), 79, 121(1), 130, 132, 296, 351(2), 352 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదైంది.
పోలీసులపై దాడి చేశారు
తమను పరుష పదజాలంతో దూషించారని, ‘నీ సంగతి చెప్తా’ అని బెదిరించారని ఒక పోలీసు అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై మరో కేసు నమోదైంది. ‘మహిళా ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి పంపిస్తున్న క్రమంలో వారి వెనుక సుధీర్‌రెడ్డి, కమలాకర్, హరీశ్‌రావు తదితరులు దాక్కొని బలవంతంగా గేటు దాటేందుకు ప్రయత్నించారు. పోలీసులపై భౌతిక బలం ఉపయోగించారు. ఒక పోలీసు అధికారి కిందపడిపోయారు. కేటీఆర్ ఒక పోలీసు అధికారి కాలర్ పట్టుకున్నారు. కేటీఆర్, జగదీశ్‌రెడ్డి పదేపదే పోలీసులపై తమ మోచేతులతో దాడి చేశారు. మా ఎమ్మెల్యేకిఏమైనా అయితే ఒక్కొక్కడికి పగులుతది అని కమలాకర్ బెదిరించారు. చొక్కాలు విప్పి నిరసన తెలుపుతూ నీ అయ్య రేవంత్‌రెడ్డి గాడికి ఏమన్నా పొతుందా? యూనిఫాం పీకురా, ఎవడ్రా నువ్వు, అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
స్పీకర్ కులం తెలిసే దూషించారు
స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే దూషించారని హైదరాబాద్ పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ‘ఎవడురా మీకుఆదేశాలిచ్చింది. రమ్మనుపో ఆ స్పీకర్ గాడిని అని దూషించారు. ఇంకా అభ్యంతకర వ్యాఖ్య చేశారు. మీడియా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుని హంగామా చేశారు’ అని పేర్కొన్నారు. అసెంబ్లీ బందోబస్తులో ఉన్న ఒక ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, అసెంబ్లీ మార్షల్స్, ఎస్‌పీఎఫ్ సిబ్బంది వాంగ్మూలాలను నమోదు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు.