Share News

కేంద్రం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోంది: ఎంపీ రఘునందన్ రావు

ABN , Publish Date - Mar 19 , 2026 | 08:33 PM

కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును 2014 తర్వాతి నుంచి ప్రోత్సహిస్తోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. నేషనల్ మిషన్ ఫర్ ఏడిబుల్ ఆయిల్ పేరిట ఆయిల్ పామ్ రైతును ఆదుకోవడానికి ఏటా ఎకరాకు రూ.4200లు కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని తెలిపారు.

కేంద్రం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోంది:  ఎంపీ రఘునందన్ రావు
MP Raghunandan Rao

సిద్దిపేట జిల్లా, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును 2014 తర్వాతి నుంచి ప్రోత్సహిస్తోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) వ్యాఖ్యానించారు. ఈరోజు(శుక్రవారం) నంగునూర్ మండలం నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వద్ద రైతు మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు. నేషనల్ మిషన్ ఫర్ ఏడిబుల్ ఆయిల్ పేరిట ఆయిల్ పామ్ రైతును ఆదుకోవడానికి ఏటా ఎకరాకు రూ.4200లు కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని తెలిపారు. 2021లో తానే ముందుకు వచ్చి తన సొంత గ్రామం బొప్పాపూర్‌లో సాగు చేపట్టానని వివరించారు. ఈ రోజు సిద్దిపేట తర్వాత 3000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న నియోజకవర్గం దుబ్బాక అని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు.


30 ఎకరాల్లో సాగుచేస్తున్నా: గుత్తా సుఖేందర్ రెడ్డి

తాను 30 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుచేస్తున్నానని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఆయిల్ పామ్ సాగులో పెండ పురుగు ప్రధాన సమస్య అని చెప్పుకొచ్చారు. అయితే.. కొన్ని చర్యలతో ఈ సమస్యను పరిష్కరించవచ్చని అన్నారు. ఎన్ని ఎరువులు వేసినా, ఏడాదికి రెండుసార్లు మాత్రం మన సేంద్రియ ఎరువులను వాడాలని సూచించారు. క్రూడాయిల్ మాత్రమే కాదని, రిఫైనరీ కూడా ఇక్కడకు వస్తుండటం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. ఆయిల్ దిగుమతి పూర్తిగా బంద్ చేయాలంటే మనమంతా వీలైనంత ఎక్కువగా ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని సూచించారు. దిగుమతి తగ్గితే దేశానికి లక్ష కోట్ల విదేశీ మారకం మిగులుతుందని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.


మరింత సాయం అందేలా కృషి: గడ్డం ప్రసాద్ కుమార్

తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు పెరగాలనే ధృడ సంకల్పంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పని చేస్తున్నారని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. ఆయిల్ పామ్ సాగు పెరగడానికి ప్రభుత్వం తరఫున ఎలాంటి సహకారమైనా అందిస్తామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డితో మాట్లాడి రైతుకు మరింత సాయం అందేలా కృషి చేస్తామని భరోసా కల్పించారు. ఎకరం ఉన్నా, అర ఎకరం ఉన్నా ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని.. ఎలాంటి సహకారమైనా అందిస్తామని గడ్డం ప్రసాద్ కుమార్ భరోసానిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నిన్ను చంపేస్తాం.. రాజాసింగ్‌కు ఆగంతకుల బెదిరింపు..

హైదరాబాద్‌లో తమ్ముడి రాక్షసత్వం.. అక్కను హత్య చేసి.. ఆపై దారుణంగా..

యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక మలుపు...

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 19 , 2026 | 08:55 PM