Share News

చెరువులు ఎండి.. మంజీర ఇంకి..

ABN , Publish Date - Jul 18 , 2026 | 01:22 PM

వరుణుడు కరుణించకపోవడంతో రైతుల్లో ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. ఆకాశం మేఘావృతమైనప్పటికీ చినుకులు కురవకుండానే చెదిరిపోతున్నాయి.

చెరువులు ఎండి.. మంజీర ఇంకి..
Medak water crisis

  • డెడ్‌స్టోరేజీ లెవల్‌కు ఘనపురం ప్రాజెక్టు

  • ‘బోరు’మంటున్న రైతులు

  • పొద్దంతా మోటార్లు నడిచినా తడవని ఎకరం

  • గంట గంటకూ ట్రిప్పింగ్‌లు..బ్రేక్‌డౌన్‌లతో కరెంటు కష్టాలు

పాపన్నపేట(మెదక్): వరుణుడు కరుణించకపోవడంతో రైతుల్లో ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. ఆకాశం మేఘావృతమైనప్పటికీ చినుకులు కురవకుండానే చెదిరిపోతున్నాయి. వర్షం వస్తుందనే ఆశతో ఆకాశం వైపు చూస్తున్న రైతులకు నిరాశే ఎదురవుతుంది. మరోవైపు నీటి వనరులు వెలవెలబోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి తడులు పారడం లేదంటే, కరెంటు సరఫరా ముప్పుతిప్పలు పెడుతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నారు. మంజీరా నదిలో రోజురోజుకూ నీటి నిల్వలు తగ్గుతున్నాయి.


sdp1.jpgదీంతో మంజీరా లిఫ్ట్‌ల ద్వారా వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్న రైతుల్లో ఆందోళన మొదలైంది. ఘనపురం ఆనకట్ట వద్ద డెడ్‌స్టోరేజీకి పడిపోవడంతో ఎడమ కాలువకు నీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. కాలువ కింద ఉన్న సుమారు 12 వేల ఎకరాల ఆయకట్టు భూముల్లో సాగు ఇక కష్టమే. ఇటు చెరువులు, కుంటల్లోనూ సరిపడా నీరు లేక వెలవెలబోతున్నాయి. చెరువుల ఆయకట్ట కింద సాగు చేసే రైతుల పరిస్థితి అగమ్యగోచరమే. వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.


బోరు బావుల్లో నీటి మట్టం రోజురోజుకూ పడిపోతోంది. పొద్దంతా మోటార్లు నడిపినా ఎకరం కూడా తడవడం లేదని రైతులు వాపోతున్నారు. విద్యుత్‌ సమస్యలు మరో పరీక్షగా మారాయి. గంట గంటకూ ట్రిప్పింగ్‌లు, తరచూ బ్రేక్‌డౌన్‌లతో బోరు మోటార్లు సక్రమంగా పనిచేయడం లేదు. నీరు ఉన్న బోర్ల నుంచి కూడా సమయానికి సాగునీరు అందక అక్కడక్కడ నాటిన వరి పైర్లు ఎరుపెక్కుతున్నాయి. ప్రతీకూల పరిస్థితులు ఎదురైనా రైతులు ఆశను వదులుకోవడం లేదు. ఈ రోజు కాకపోతే రేపైనా వర్షాలు పడి, పంటలు నిలబడతాయిు అనే నమ్మకంతో నాట్లు వేస్తున్నారు.


sdp1.2.jpgవర్షాధార పంటలకు ముప్పు

  • వేల ఎకరాల్లో ఎండిపోయే ప్రమాదం

కోహీర్‌: కోహీర్‌ మండలంలో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ఆశించినస్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. మండల వ్యాప్తంగా సుమారు 30,238 ఎకరాల్లో వర్షాధార పంటలు సాగు చేయగా, ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండుముఖం పడుతున్నాయి. నేలలో తేమ పూర్తిగా తగ్గిపోవడంతో మొక్కలు ఎదుగుదల కోల్పోయి ఆకులు వాలిపోతున్నాయి. బిలాల్‌పూర్‌, మనియార్‌పల్లి, కవేలి, గురుజువాడ, రాజనెల్లి, మద్రి, పీచేర్యాగడి, సజ్జాపూర్‌, బడంపేట, పర్శపల్లి, గొడిగర్‌పల్లి, పైడిగుమ్మల్‌, నాగిరెడ్డిపల్లి, పోతిరెడ్డిపల్లి, వెంకటాపూర్‌, చింతలఘట్టు తదితర గ్రామాల్లో రైతులు విత్తనాలు వేశారు.


xx.jpgమండల వ్యాప్తంగా చూసుకుంటే సోయాబీన్‌ 10,866 ఎకరాలు, కంది 7,348 ఎకరాలు, పత్తి 4,597 ఎకరాలు, మొక్కజొన్న 3,527 ఎకరాలు, చెరకు 2,672 ఎకరాలు, జనుము 450 ఎకరాలు, మినుము 410 ఎకరాలు, పెసర 115 ఎకరాలు, వరి 98 ఎకరాలు చొప్పున మొత్తం 30,238 ఎకరాల్లో సాగు చేశారు. అయితే, విత్తనాలు వేసిన తర్వాత ఆశించిన వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ఈ సీజన్‌లో రైతులు విత్తనాలు, ఎరువులు, దుక్కి, కూలీల కోసం భారీగా పెట్టుబడులు పెట్టారు.


కానీ వరుణుడు ముఖం చాటేయడంతో పెట్టుబడులు నీటిలో కలిసే పరిస్థితి నెలకొంది. బోర్లు లేని రైతులు పూర్తిగా ఆకాశాన్నే నమ్ముకుని ఎదురు చూస్తుండగా, వర్షాలు కురవకపోతే వేల ఎకరాల్లో పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం అనుకూలించి త్వరలో విస్తారంగా వర్షాలు కురవకపోతే ఈ ఖరీఫ్‌ సీజన్‌ తీవ్ర నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఫేక్‌ సర్టిఫికెట్లపై దక్షిణ డిస్కం ఫోకస్‌

పుదీనా ఆకులు తింటే.. గ్యాస్ సమస్య తగ్గుతుందా?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 18 , 2026 | 01:22 PM