Share News

కేసు వస్తే చాలు.. కాసుల కోసం వేట

ABN , Publish Date - Jul 18 , 2026 | 11:10 AM

హైదరాబాద్ నగరంలోని పలు పోలీస్‌ స్టేషన్లు అక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కేసు వస్తే చాలు.. కాసుల కోసం వేట
Hyderabad police corruption

  • అడ్మిన్‌, సెక్టార్‌ ఎస్సైలు, ఎస్‌హెచ్‌వోలు నిందితులతో కుమ్మక్కు

  • పోలీస్‌ స్టేషన్లలో మిలాఖత్‌ దందా!

  • బాధితుల గోడు పట్టించుకోని వైనం

  • మెజారిటీ పోలీస్‌ స్టేషన్‌లలో ఇదే పరిస్థితి

- సికింద్రాబాద్‌ జోన్‌లోని ఓ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక కుటుంబంపై మరో కుటుంబ సభ్యులు అకారణంగా దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే అక్కడి అడ్మిన్‌ ఎస్సై అస్సలు పట్టించుకోలేదు. కనీసం ఇన్‌స్పెక్టర్‌ను కూడా కలవకుండా ఎస్‌ఐ అడ్డుకున్నారు. ‘రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్లతో పెట్టుకోవద్దు.. మీకే నష్టం’ అంటూ నిర్లక్ష్యంగా బెదిరింపు ధోరణిలో సమాధానం ఇవ్వడంతో బాధితులు డీసీపీని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో ఎట్టకేలకు (15రోజులకు) కేసు నమోదైంది. అయితే, దీనికి కారణమైన సదరు ఎస్‌ఐ ఆ తర్వాత ఓ కేసులో స్టేషన్‌ బెయిల్‌ కోసం రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి జైలుపాలయ్యాడు.


- మరో పీఎస్‏లో..

ఇదే జోన్‌లోని మరో పోలీస్‏స్టేషన్‌లో రూ.25 లక్షల ఆర్థిక మోసానికి గురైన ఒక బాధితుడి పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. డబ్బులు ముట్టాక ఎక్వి్‌పమెంట్‌ ఇవ్వకుండా సదరు వ్యక్తులు ముఖం చాటేశారు. దీంతో వారిపై బాధితుడు ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా ఎస్‌ఐ మాత్రం కనీసం కేసు ఎంట్రీ కూడా చేయలేదు. కాలయాపన చేస్తూ.. బాధితుడిని స్టేషన్‌ చుట్టూ తిప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. దీంతో పోలీస్‌ ఉన్నతాధికారులను కలిసి బాధితుడు తన గోడును వెళ్లబోసుకున్నాడు.


city6.2.jpgహైదరాబాద్‌ సిటీ: నగరంలోని పలు పోలీస్‌ స్టేషన్లు అక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులకు అండగా నిలవాల్సిన కొందరు అడ్మిన్‌, సెక్టార్‌ ఎస్సైలు, ఎస్‌హెచ్‌వోలు.. నిందితులు, ఆర్థిక మోసగాళ్లతో చేతులు కలిపి దందాలకు తెరతీశారు. స్టేషన్‌కు కేసు వచ్చిందంటే చాలు.. న్యాయం చేయడం పక్కనబెట్టి కాసుల వేటలో పడుతున్నారనే విమర్శలు నగరవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. నగరంలోని మెజారిటీ పోలీస్‌ స్టేషన్లలో చీటింగ్‌, ఆర్థిక మోసాల కేసుల విషయంలో ఇదే తరహా దందా సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.


నిందితులతో చేతులు కలుపుతున్న కొంతమంది పోలీసు అధికారులు కావాలనే కేసులను పక్కదారి పట్టించడం, లేదంటే కాలయాపన చేయడం చేస్తున్నారు. బాధితులపైనే విమర్శలు చేయడం, బెదిరించడం చేస్తూ నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. బాధితులు విసిగి వేసారిపోయిన తర్వాత నామమాత్రంగా ఓ చీటింగ్‌ కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. అంతేకాదు. నిందితులకు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపుతున్నారు. బాధితులను పిలిచి కేసు నమోదు చేశాం.. ఇద్దరూ కలిసి కోర్టులో చూసుకోండి.. ఇక స్టేషన్‌కు రావొద్దు అంటూ చావు కబురు చల్లగా చెబుతున్నారు.


చర్యలు తీసుకోవడంలో విఫలం..

డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉన్న కొందరు ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్లు కూడబలుక్కొని బాధితులను పట్టించుకోకుండా.. నేరస్థుల కొమ్ముకాస్తూ రూ. లక్షల్లో కొల్లగొడుతున్నారు. అలాంటి వారి జాబితా ఉన్నతాధికారుల వద్ద సిద్ధంగా ఉన్నా, వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెజారిటీ పోలీస్‌ స్టేషన్‌లలో ఇన్‌స్పెక్టర్‌లు, అడ్మిన్‌ ఎస్సైలు, సెక్టార్‌ ఎస్సైలు, క్షేత్రస్థాయి సిబ్బంది.. ఇలా ఎవరికి వారు కేసు వచ్చిందంటే చాలు.. కాసుల వేటలో పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పోలీస్‌ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కలిగేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఫేక్‌ సర్టిఫికెట్లపై దక్షిణ డిస్కం ఫోకస్‌

పుదీనా ఆకులు తింటే.. గ్యాస్ సమస్య తగ్గుతుందా?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 18 , 2026 | 11:10 AM