Share News

నల్లగొండలో కలకలం: వైద్య విద్యార్థిని, యువకుడి అనుమానాస్పద మృతి..

ABN , Publish Date - Jul 18 , 2026 | 10:28 AM

నల్లగొండ జిల్లాలో వైద్య విద్యార్థిని, ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు అనుమానస్పద స్థితిలో మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

నల్లగొండలో కలకలం: వైద్య విద్యార్థిని, యువకుడి అనుమానాస్పద మృతి..
Nalgonda News

నల్లగొండ, జులై 18: జిల్లాలో వైద్య విద్యార్థిని, ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కట్టంగూరు మండలం మునుకుంట్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ తొలి సంవత్సరం చదువుతున్న యువతి.. ప్రిపరేషన్ హాలిడేస్ నిమిత్తం స్వగ్రామమైన మునుకుంట్లకు వచ్చింది. నిన్న( శుక్రవారం) సాయంత్రం ఇంట్లో దూలానికి ఉరివేసుకున్న స్థితిలో యువతి కనిపించింది. సాయంత్రం ఇంటికి వచ్చిన ఆమె సోదరి ఈ విషయాన్ని గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.


అదే గ్రామానికి చెందిన చరణ్‌ అనే యువకుడు.. యువతిని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో చరణ్ కూడా తమ వ్యవసాయ బావి వద్ద ఉన్న చెట్టుకు ఉరివేసుకుని మృతిచెందినట్లు గుర్తించారు. శుక్రవారం సాయంత్రం చరణ్ మరో వ్యక్తితో కలిసి యువతి ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాతే ఈ రెండు ఘటనలు చోటుచేసుకోవడంతో యువతి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చరణ్ బలవంతం చేశాడా, లేదా మరేదైనా అఘాయిత్యానికి పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువతి తండ్రి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో వార్డు బాయ్‌గా పనిచేస్తుండగా, తల్లి స్వగ్రామంలో కూలీగా పనిచేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

గుంటూరు ఘటనపై హోం మంత్రి అనిత సీరియస్

ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. డీజే ప్లేయర్‌పై కేసు నమోదు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 18 , 2026 | 10:47 AM