రావణ్ కేసులో చెప్పిందే చెప్పిన గమన!
ABN , Publish Date - Jul 18 , 2026 | 05:18 AM
యూట్యూబర్ ‘ప్రశ్న’ రావణ్ కేసులో గమన, ఇంద్రసేన చౌదరి చెప్పిన కథే చెబుతున్నారు. గత విచారణలో ఏం చెప్పారో తాజాగా వాటినే పునరావృతం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: యూట్యూబర్ ‘ప్రశ్న’ రావణ్ కేసులో గమన, ఇంద్రసేన చౌదరి చెప్పిన కథే చెబుతున్నారు. గత విచారణలో ఏం చెప్పారో తాజాగా వాటినే పునరావృతం చేశారు. వీరిద్దరినీ గన్నవరం పోలీసులు శుక్రవారం ప్రశ్నించారు. ఈసారి విచారణ పెనమలూరు పోలీసు స్టేషన్ పై అంతస్తులో సాగింది. గన్నవరం ఇన్‌చార్జి డీఎస్పీ ధర్మేంద్ర, ఇన్‌స్పెక్టర్ బీవీ శివప్రసాద్.. ఇంద్రసేనను మధ్యాహ్నం వరకు ప్రశ్నించారు. మధ్యాహ్నం నుంచి సోదాల్లో భాగంగా ఆయన్ను పోలీసులు తీసుకెళ్లారు. గమనను రాత్రి 8 గంటల వరకు విచారించారు. అధికారుల ప్రశ్నలకు ఆమె మౌనం దాల్చారు. 7 గంటల విచారణలో సుమారు 30 ప్రశ్నలు వేయగా.. కొన్నింటికి మాత్రమే గమన బదులిచ్చారు. గమన, ఇంద్రసేన ఫోన్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపారు. గమన సెల్‌ఫోన్ డేటాను ఎఫ్‌ఎ్‌సఎల్ అధికారులు విశ్లేషించారు. నివేదికను కొద్దిరోజుల క్రితం పోలీసులకు అందజేశారు. ఈ నివేదిక ముందు పెట్టి శనివారం ఆమెను ప్రశ్నించాలని పోలీసులు నిర్ణయించారు. మరో 2-3 రోజుల్లో ఇంద్రసేన సెల్‌ఫోన్ నివేదికా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇద్దరినీ శనివారం మళ్లీ విచారణకు రావాలని పోలీసులు నోటీసులిచ్చారు.
రావణ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ 22కి వాయిదా
చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ-ఉపా) కేసులో నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ‘ప్రశ్న’ రావణ్ బెయిల్ పిటిషన్‌పై విచారణను బెజవాడ కోర్టు ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్ కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు కొద్దిరోజుల కిందట విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో వ్యాజ్యం వేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రాసిక్యూషన్‌ను ఆదేశిస్తూ న్యాయాధికారి సునీల్‌కుమార్ విచారణను వాయిదా వేశారు.