హోర్ముజ్‌పై పోరు.. అమెరికా-ఇరాన్ దాడులు మరింత తీవ్రం
ABN , Publish Date - Jul 18 , 2026 | 07:28 AM
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మరింత ఉద్ధృతమవుతోంది. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలమవడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మరింత ఉద్ధృతమవుతోంది. ప్రపంచ జల రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరు తీవ్రమవుతున్న వేళ.. ఇరు దేశాలు పరస్పరం మౌలిక వసతులు, సైనిక లక్ష్యాలపై దాడులు కొనసాగిస్తున్నాయి. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలమవడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
తాజాగా.. అమెరికా దక్షిణ ఇరాన్ ప్రాంతంలోని బ్రిడ్జిలు, ఇంధన సంబంధిత మౌలిక వసతులపై వైమానిక దాడులకు దిగింది. బందర్ ఖమీర్‌లోని రహదారులు, రైల్వే వంతెనలే లక్ష్యంగా దాడులు జరిగినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఆ దేశ ప్రధాన నౌకాశ్రయం బందర్ అబ్బాస్‌కు వెళ్లే రవాణా మార్గాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. ఈ దాడుల్లో గల్ఫ్ ఆఫ్ ఒమన్ తీరంలోని వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన చాబహార్ పోర్టులోని ఓ నిఘా టవర్ కూడా కూలిపోయింది. ఆ టవర్ వాణిజ్య నౌకల రాకపోకలను పర్యవేక్షించేదని ఇరాన్ తెలపగా.. అది రివల్యూషనరీ గార్డ్ నిఘా వ్యవస్థలో భాగంగా ఉంటూ వాణిజ్య నౌకలను పరిశీలిస్తోందని అమెరికన్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది.
మరోవైపు.. ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. అమెరికా మిత్రదేశాలైన ఖతర్, కువైట్‌లపై క్షిపణి దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో కువైట్‌లోని సముద్రజలాల ఉప్పునీటి శుద్ధి కేంద్రం దెబ్బతిన్నట్లు సమాచారం. కాగా.. ఈ యుద్ధంలో మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతర్‌పైనా దాడులు జరిగాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తన ప్రసంగంలో ఇరాన్‌పై అమెరికా ఆధిపత్యం సాధిస్తోందని, త్వరలోనే దాని ఫలితాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. అయితే.. యుద్ధం మరింత ఉగ్రరూపం దాల్చుతుండటంతో పశ్చిమాసియా దేశాలు సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవీ చదవండి:
ట్రూత్ సోషల్ పోస్టుకు ధర నిర్ణయించిన ట్రంప్
బ్రిటన్ కొత్త ప్రధాని ఆండీ బర్న్‌హామ్