ట్రూత్ సోషల్ పోస్టుకు ధర నిర్ణయించిన ట్రంప్
ABN , Publish Date - Jul 18 , 2026 | 06:04 AM
పొద్దున్నే ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ఓ పోస్టు పెడతారు.. స్టాక్ మార్కెట్ అమాంతం పడిపోతుంది. మధ్యాహ్నానికి ఆయన అందుకు విరుద్ధమైన మరో పోస్టు పెడతారు. అంతే.. మార్కెట్ ఒక్కసారిగా...
‘ట్రూత్ ఏపీఐ’ ఫీచర్‌ను తీసుకొచ్చిన ట్రూత్ సోషల్
సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ప్రముఖుల సందేశాలు పోస్టు చేయకముందే చేరవేత
ట్రంప్ పోస్టులతో కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు
న్యూయార్క్, జూలై 17: పొద్దున్నే ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ఓ పోస్టు పెడతారు.. స్టాక్ మార్కెట్ అమాంతం పడిపోతుంది. మధ్యాహ్నానికి ఆయన అందుకు విరుద్ధమైన మరో పోస్టు పెడతారు. అంతే.. మార్కెట్ ఒక్కసారిగా రాకెట్ వేగంతో పైకి దూసుకుపోతుంది. మార్కెట్ పడిపోయినప్పుడు స్టాక్స్ కొన్నవారు కొన్ని గంటల్లోనే భారీ లాభాలు సంపాదిస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆడుతున్న జూదం ఇది. ఇప్పుడు ఆయన సొంత కంపెనీ ట్రూత్ సోషల్ మరో అడుగు ముందుకేసింది. ఆ ప్లాట్‌ఫామ్‌లో ట్రంప్ లాంటి ముఖ్యులు ఉంచే సందేశాలను.. పోస్టు చేయటానికి ముందే స్టాక్ ట్రేడింగ్ కంపెనీలు, బ్యాంకులకు అమ్మకానికి పెట్టబోతోంది. అందుకోసం ‘ట్రూత్ ఏపీఐ’ పేరుతో ప్రత్యేక ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. ఇది ఆగస్టు 1 నుంచి అందుబాటులోకి రానుంది. దీని సబ్‌స్ర్కిప్షన్ తీసుకున్న సంస్థలకు ట్రంప్‌లాంటి ప్రభావవంతమైన వ్యక్తుల సందేశాలను తమ ప్లాట్‌ఫామ్‌పై పోస్టు చేయకముందే చేరవేస్తామని ట్రూత్ సోషల్ మాతృ సంస్థ ‘ట్రంప్ మీడియా, టెక్నాలజీ గ్రూప్’ (టీఎంటీజీ) తాత్కాలిక సీఈవో కెవిన్ మెక్‌గర్న్ శుక్రవారం ప్రకటించారు. కంపెనీ ఆదాయం పెంచుకొనేందుకే ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు.
ఇన్‌సైడ్ ట్రేడింగ్ కోసమే..!
ప్రముఖ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్)పై కోపంతో 2022లో ట్రంప్ సొంతంగా ట్రూత్ సోషల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఈ ప్లాట్‌ఫామ్‌పై మాత్రమే పోస్టులు చేస్తూ వస్తున్నారు. దీని మాతృ సంస్థ టీఎంటీజీలో ట్రంప్ కుటుంబానికి 41ు వాటా ఉంది. ఈ సంస్థ ప్రస్తుతం భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక ట్రూత్ సోషల్‌లో చేస్తున్న వివాదాస్పద ప్రకటనలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఇదంతా ఇన్‌సైడ్ ట్రేడింగ్ కిందికే వస్తుందని అమెరికాలో ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. ఇప్పుడు ట్రంప్ పోస్టులను కొనుక్కునే సంస్థలు.. వాటి ప్రభావాన్ని అంచనా వేసి ముందుగానే స్టాక్స్‌ను అమ్మటం, కొనటం చేస్తాయని.. అది చట్ట వ్యతిరేకమైన ఇన్‌సైడ్ ట్రేడింగ్ కిందికే వస్తుందని స్టాన్‌ఫిల్ క్యాపిటల్ పార్టనర్స్ పోర్ట్‌పోలియో మేనేజర్ మార్క్ స్పీగెల్ అన్నారు. ట్రంప్ కుటుంబం స్టాక్‌మార్కెట్‌లో అక్రమంగా లాభాలు సంపాదించటానికే ట్రూత్ యూపీఐ ఫీచర్ తెచ్చారని డెమోక్రాటిక్ పార్టీ సెనేటర్ రాన్ వైడెన్ ఆరోపించారు. ఈ అంశంపై అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ స్పందించేందుకు నిరాకరించింది.
ఇవి కూడా చదవండి
తప్పిపోయిన 35 ఏళ్ల తర్వాత.. అమ్మకు దగ్గరైన కూతురు