తప్పిపోయిన 35 ఏళ్ల తర్వాత.. అమ్మకు దగ్గరైన కూతురు
ABN , Publish Date - Jul 17 , 2026 | 10:15 AM
రెండేళ్ల వయసులో తప్పిపోయిన ఓ చిన్నారి.. 35 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని తిరిగి కలుసుకుంది. ఈ భావోద్వేగభరితమైన ఘటన చైనాలో చోటుచేసుకుని అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ చైనాలో రెండేళ్ల వయసులో కుటుంబానికి దూరమైన ఓ చిన్నారి.. 35 ఏళ్ల తర్వాత కన్నతల్లి ఒడికి చేరింది. తల్లీకూతుళ్ల కలయిక ఎంతోమందిని భావోద్వేగానికి గురిచేస్తోంది. ఈ ఘటనను సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది.
ప్రస్తుతం 37 ఏళ్ల వయసున్న జోంగ్ ఫెంగ్లిన్ చిన్నప్పుడు గ్వాంగ్జీ ప్రావిన్స్‌లోని నాన్నింగ్ నగరంలో తన తల్లిదండ్రులతో కలిసి ఉండేది. ఆమె తల్లిదండ్రులు మార్కెట్‌లో అల్లం, వెల్లుల్లి అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవారు. 1991లో ఓ రోజు తండ్రి జోంగ్ ఫెంగ్లిన్‌ను తన కూరగాయల దుకాణానికి తీసుకెళ్లాడు. పనిలో బిజీగా ఉండటంతో ఏదైనా కొనుక్కొని తినమంటూ కొంత డబ్బు తన చేతిలో పెట్టాడు. అమాయకంగా ఆహారం కోసం వెళ్లిన రెండేళ్ల చిన్నారి జనసందోహంలో దారి తప్పి మరో మార్కెట్‌కు చేరుకుంది. ఆ తర్వాత కుటుంబానికి కనిపించకుండా పోయింది.
ఏడుస్తున్న చిన్నారిని చూసిన ఓ బట్టల వ్యాపారి జాలిపడి చేరదీశాడు. ఆ చిన్నారి కుటుంబాన్ని వెతికేందుకు మార్కెట్ అధికారులకు తన వివరాలు ఇచ్చి ప్రకటనలు చేయించినా ఎవరూ ముందుకు రాలేదు. చివరకు ఆమెను మరో నగరానికి తీసుకెళ్లి పేరు మార్చి పెంచాడు. దత్తత తల్లిదండ్రులు, అన్నయ్య ప్రేమతో జోంగ్ పెరిగింది. ప్రస్తుతం ఆమెకు వివాహం కాగా, ఎనిమిదేళ్ల కుమార్తె ఉంది.
ఇదిలా ఉండగా, జోంగ్ కన్న తల్లిదండ్రులు దశాబ్దాల పాటు ఆమె కోసం వెతికారు. ఆమె చెల్లెలు కూడా.. తప్పిపోయిన పిల్లలను వారి కుటుంబాలతో కలిపే 'బేబీ కమ్ హోమ్' అనే స్వచ్ఛంద సంస్థలో తన అక్క జోంగ్ వివరాలను నమోదు చేసింది. అయితే జోంగ్ తండ్రి 2024లో మరణించారు. తన పెద్ద కూతురిని మరోసారి చూడాలన్న ఆయన చివరి కోరిక నెరవేరలేదు. చివరి రోజుల వరకు కూడా 'మీ అక్క గురించి ఏమైనా సమాచారం దొరికిందా?' అని తన చిన్న కూతురిని అడిగేవారని కుటుంబ సభ్యులు తెలిపారు.
చిన్నప్పుడు తన ఒంటిపై ఉన్న గాయాల కారణంగా తనను తల్లిదండ్రులే వదిలేశారని జోంగ్ ఎన్నో సంవత్సరాలు భావించింది. దీంతో తన అసలు కుటుంబాన్ని వెతికే ప్రయత్నాన్ని కూడా దాదాపు మానేసింది. అయితే స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఆమెకు ధైర్యం చెప్పి, తన వివరాలను నమోదు చేయాలని ప్రోత్సహించారు. ఈ ఏడాది ఏప్రిల్ 12న జోంగ్ 'బేబీ కమ్ హోమ్'లో తన వివరాలను నమోదు చేసింది. కొద్ది రోజులకే ఆమె ఫొటోను చూసిన ఓ మహిళ, తమ కుటుంబం నుంచి ఎన్నో ఏళ్ల క్రితం తప్పిపోయిన తన సోదరిని ఆమె పోలి ఉందని గుర్తించింది. అనంతరం నిర్వహించిన డీఎన్ఏ పరీక్షలో ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారేనని తేలింది.
జులై 7న జోంగ్ తన స్వస్థలానికి వెళ్లి కన్నతల్లిని కలుసుకుంది. తల్లిని కౌగిలించుకుని భావోద్వేగానికి గురైంది. 'ఈ జన్మలో మిమ్మల్ని మళ్లీ చూస్తానని అనుకోలేదు' అంటూ కన్నీటి పర్యంతమైంది. 35 ఏళ్లుగా దూరమైన బంధం మళ్లీ ఒక్కటైంది. తండ్రి తన కూతురిని చూడాలన్న కోరిక నెరవేరకుండానే కన్నుమూసినా, తల్లి మాత్రం ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత తన కూతురిని హత్తుకుని ఆనందభాష్పాలు పెట్టుకుంది.
Also Read:
పశ్చిమ బెంగాల్‌లో విషాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు..
చిన్న ఎమోజీ.. పెద్ద భావం! ప్రపంచ ఎమోజీ దినోత్సవం 2026 విశేషాలు