Share News

మూగజీవాలకు అపన్నహస్తం..

ABN , Publish Date - Jul 17 , 2026 | 10:25 AM

దెబ్బతగిలి రక్తం వస్తున్నా బయటకు చెప్పలేని మూగజీవాలవి. నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా ఓ మూలకు చేరి పడుకుంటాయి.

మూగజీవాలకు అపన్నహస్తం..

  • గాయపడిన వీధికుక్కలకు చికిత్స

  • పక్షులను కాపాడుతున్న వాలంటీర్లు

  • వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేస్తే స్పందిస్తారు

హైదరాబాద్: దెబ్బతగిలి రక్తం వస్తున్నా బయటకు చెప్పలేని మూగజీవాలవి. నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా ఓ మూలకు చేరి పడుకుంటాయి. ఎవరినీ ఇబ్బంది పెట్టవు. ఇలాంటి జీవాల కష్టం తెలుసుకుంటారు వారు. అవసరాన్ని బట్టి చికిత్స అందించి వాటికి సకల సపర్యలు చేస్తారు. మంచి ఆహారం ఇచ్చి సంరక్షించి కోలుకున్నాక బయటకు పంపిస్తారు. ఎవరైనా రోడ్డు మీద గాయాలతో పడి ఉన్న మూగజీవాల గురించి సమాచారం ఇస్తే చాలు క్షణాల్లో అక్కడకు వెళ్లి జీవాన్ని తీసుకెళ్లి తగిన చికిత్స చేస్తున్నారు పీపుల్స్‌ ఫర్‌ యానిమల్స్‌ సంస్థ ప్రతినిధులు. మూగజీవాలకు ఇబ్బంది కలిగిందంటే వీరు విలవిలలాడిపోతారు. వాటిని తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు.


అన్నీ తామై..

మూగజీవాలు గాయాల బారిన పడ్డాయని సమాచారం అందిన నిమిషాల్లో పీపుల్స్‌ ఫర్‌ యానిమల్స్‌ ప్రతినిఽధులు అక్కడకు చేరుకుంటారు. జంతువు పరిస్థితిని అంచనా వేసి వాటికి ఎటువంటి అపాయం కలగకుండా జాగ్రత్తగా ఒడిసిపట్టుకొని తమ వాహనంలోకి తరలిస్తారు. శునకాల విషయంలో ప్రతినిధులు ముందస్తుగా అనేక చర్యలు తీసుకుంటారు. గాయపడ్డ కుక్కను గుర్తించిన వాలంటీర్లు తమతో తెచ్చుకున్న కుక్కలను తీసుకుపోయే వాహనాలను దూరం పెడతారు. ఈ వ్యాన్‌ను చూడగానే కుక్కలు పారిపోతాయని ఇలా చేస్తారు.


పది నుంచి ఇరవై నిమిషాల పాటు సాధారణంగా ఉంటూ తమ వెంట తెచ్చుకున్న వలలో చిక్కుకునేలా చేస్తారు. ప్రేమగా దగ్గరకు తీసుకొని వాటికి భయం పోయిందని నిశ్చయించుకున్నాక వాహనంలోకి ఎక్కిస్తారు. తమ చికిత్సాలయాలకు తీసుకెళ్లి వీటికి ట్రీట్‌మెంట్‌ చేస్తారు.

వీధికుక్కలే అధికంగా వస్తుండడంతో వాటిని బయటకు పంపించేటప్పుడు వాక్సినేషన్‌ చేస్తున్నారు. దీనివల్ల ఎవరినైనా శునకం కరిచినా ప్రాణముప్పు ఉండదని వైద్యులు చెబుతున్నారు. వైద్యం అందించాక మూగజీవాలకు పౌష్టికాహారం పెడుతూ అవి కోలుకోవడంలో కీలకంగా వ్యవహరిస్తారు ఈఎన్‌టీవోస్‌ సంస్థ ప్రతినిధులు.


city5.jpgఎక్కువగా స్పందిస్తున్న యువకులు

రోడ్డున పోయేటప్పుడు గాయపడ్డ మూగజీవాలను చూస్తుంటాం. వాటికి సపర్యలు చేయడం వంటి వాటి గురించి అసలు పట్టించుకోం. ఇప్పుడు నగరవాసుల్లో ఈ ధోరణి తగ్గుతోంది. గాయపడ్డ మూగజీవాల కోసం ఏదైనా చేయాలనే తాపత్రయం యువకుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం కేబీఆర్‌ పార్కు వద్ద రెండు శునకాలు గొడవ పడ్డాయి. ఇందులో ఓ శునకం చెవికి గాయమవడంతో వాకింగ్‌కు వచ్చిన ఇద్దరు యువకులు పీపుల్స్‌ ఫర్‌ యానిమల్స్‌కు ఫిర్యాదు చేశారు. ప్రతినిధులు వచ్చే వరకు అక్కడే ఉండి శునకాన్ని అప్పగించి వెళ్లారు. ఇదే విధంగా సాగర్‌సొసైటీలో ఓ శునకం రోడ్డు ప్రమాదంలో గాయపడింది. కాలు విరగడంతో ఓ ప్రైవేట్‌ పాఠశాలకు చెందిన విద్యార్థులు సమీపంలో ఉన్న ఆల్‌వెట్‌ పెట్స్‌ క్లీనిక్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు స్పందించి శునకం కాలికి శస్త్ర చికిత్స చేశారు.


ప్రైవేట్‌ వైద్యులు సైతం..

తమ కళ్ల ముందు మూగజీవాలకు ఏం జరిగినా తట్టుకోలేరు ప్రైవేట్‌ క్లీనిక్‌ వైద్యులు. లాభం ఆశించకుండా వీధికుక్కలను ఎవరు తీసుకువచ్చినా వాటికి దగ్గరుండి ఉచితంగా చికిత్స అందించి కోలుకునే వరకు తమ వద్దే ఉంచుకుంటున్నారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ పరిసర ప్రాంతాల్లో సుమారు 15 వరకు గాయపడిన జంతువులకు ప్రైవేట్‌ వైద్యులే చికిత్స అందించారు. గాయపడ్డది మనిషైనా, జంతువైనా తమ ఆలోచన మాత్రం సేవలందించడమేనని వైద్యులు చెబుతున్నారు.


వీధికుక్కలను లెక్కిస్తారు..

వీధికుక్కలపై కొంతమంది కర్కశంగా ప్రవర్తిస్తారు. అవి కరుస్తాయేమోనని భయంతో రాళ్లతో దాడి చేస్తుంటారు. దీనివల్ల శునక జాతి అంతం అయిపోతుందని వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు వీధుల్లో వెళ్తున్న ప్రజలపై ఎగబడకుండా వాటిని పట్టుకొని కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చేస్తుంటారు. అనంతరం వాటి ప్రవర్తనపై ఎప్పటికప్పుడు దృష్టి పెడుతుంటారు. దీనివల్ల శునకాలను ఎవరైనా దొంగలించి చంపినా వెంటనే తమకు తెలిసిపోయేలా ఏర్పాట్లు చేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఖైదీకి వార్డర్‌కు మధ్య.. మూడో వ్యక్తి!

10 వేల కోట్లతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు విస్తరణ!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 17 , 2026 | 10:25 AM