Share News

ఖైదీకి వార్డర్‌కు మధ్య.. మూడో వ్యక్తి!

ABN , Publish Date - Jul 17 , 2026 | 06:33 AM

సంచలనం సృష్టించిన ఖైదీ-వార్డర్‌ బెయిల్‌ డీల్‌ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. జైల్లో ఉన్న ఖైదీ భిక్షపతికి బెయిల్‌ ఇప్పించటానికి ఒప్పందం కుదుర్చుకున్న వార్డర్‌..

ఖైదీకి వార్డర్‌కు మధ్య.. మూడో వ్యక్తి!

  • నిజామాబాద్‌ జైలు ఘటనలో కొత్త కోణం

  • జైలు నుంచి విడుదలైన 24 గంటల్లోనే చోరీకి పాల్పడిన భిక్షపతి

  • నగదులో కొంత మూడో వ్యక్తికి అప్పగింత

హైదరాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించిన ఖైదీ-వార్డర్‌ బెయిల్‌ డీల్‌ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. జైల్లో ఉన్న ఖైదీ భిక్షపతికి బెయిల్‌ ఇప్పించటానికి ఒప్పందం కుదుర్చుకున్న వార్డర్‌.. ఆ డీల్‌ను అమలు చేసేందుకు మూడో వ్యక్తిని రంగంలోకి దింపాడు. భిక్షపతి బెయిల్‌ కాగితాలపై ఆ మూడో వ్యక్తే ష్యూరిటీ సంతకాలు చేసినట్లు తెలిసింది. గత నెల 27న బెయిల్‌పై నిజామాబాద్‌ జైలు నుంచి విడుదలైన భిక్షపతి 24 గంటల వ్యవధిలోనే సిద్దిపేట జిల్లాలో భారీ చోరికి పాల్పడ్డాడు. చోరీకి ముందు నిజామాబాద్‌లో ఓ ప్రైవేటు కారును అద్దెకు తీసుకున్నాడని, ఎవరికీ సందేహం రాకుండా కారు డ్రైవర్‌ ఫోన్‌ నుంచి వార్డర్‌తోపాటు, మూడో వ్యక్తికి ఫోన్‌ చేసినట్లు వెల్లడైంది. ముందుగా మాట్లాడుకున్న ఒప్పందం మేరకు.. చోరీ అనంతరం మూడో వ్యక్తిని కలిసి కొంత నగదు అప్పగించి వెళ్లిపోయాడు. ఎంత నగదు ఇచ్చాడనేదానిపై పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. భిక్షపతి ఇచ్చిన సమాచారం ఆధారంగా కారు డ్రైవర్‌, వార్డర్‌, మూడో వ్యక్తి సెల్‌ఫోన్‌ల కాల్‌ డేటా రికార్డులను పరిశీలిస్తున్నారు. కాగా కేసు నమోదైనప్పటి నుంచి వార్డర్‌ గోపాల్‌ అజ్ఞాతంలోనే ఉన్నాడు. ఈ కేసు సంచలనంగా మారటంతో.. జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) సంబంధిత విభాగాల నుంచి వివరణ కోరినట్లు తెలిసింది. కేసు తీవ్రత, ప్రభుత్వ ఉద్యోగుల ప్రమేయం నేపథ్యంలో నిఘా విభాగం రంగంలోకి దిగింది. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా నిజామాబాద్‌ జైలుతోపాటు జైళ్లశాఖలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, దొంగతనం కేసులో భిక్షపతిని అరెస్ట్‌ చేసిన పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు సిద్దిపేట జైలుకు విచారణ ఖైదీగా తరలించారు. అతనికి సంబంధించిన వివరాలేవి బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Updated Date - Jul 17 , 2026 | 06:51 AM