10 వేల కోట్లతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు విస్తరణ!
ABN , Publish Date - Jul 17 , 2026 | 05:59 AM
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విస్తరించాలని జీఎంఆర్ సంస్థ యోచిస్తోంది. 2031 నాటికి విమానాశ్రయ వార్షిక ప్రయాణికుల..
హైదరాబాద్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విస్తరించాలని జీఎంఆర్ సంస్థ యోచిస్తోంది. 2031 నాటికి విమానాశ్రయ వార్షిక ప్రయాణికుల సామర్థ్యాన్ని ఏడాదికి 5 కోట్లకు పెంచేలా విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం సుమారు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విమానాశ్రయం ఏడాదికి 3.4 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో ఉండగా, భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరో టెర్మినల్ నిర్మాణంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు జీఎమ్మార్ సంస్థ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన అనుమతులు కూడా పొందినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల నిర్వహించిన ఓ అంతర్జాతీయ సర్వేలో ప్రపంచంలోని బెస్ట్ ఫ్యామిలీ టూర్స్ విభాగం జాబితాలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానాన్ని దక్కించుకుందని ఎయిర్‌పోర్టు సీఈఓ ఖదీర్ కదివరన్ గురువారం తెలిపారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్థి చెందుతున్న విమానాశ్రయంగా గుర్తింపు పొందుతూ.. బెంగుళూరు ఎయిర్‌పోర్టునూ వెనక్కి నెట్టిందని అన్నారు. ఈ విమానాశ్రయం ఆధారంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు నాలుగు లక్షల మందికి ఉపాధి లభిస్తుండగా, 2038 నాటికి ఈ సంఖ్య 6 లక్షలకు చేరుతుందని అధికారులు అంచనా వేశారు. రాష్ట్ర స్థూల విలువ జోడింపు (జీవీఏ)లో సుమారు 5శాతం వాటా విమానాశ్రయం ద్వారానే వస్తోందని, ప్రస్తుతం దీని ఆర్థిక విలువ రూ. 90 వేల కోట్లుగా ఉండగా, 2038 నాటికి అది రూ.2 లక్షల కోట్లకు చేరుకునే అవకాశముందని పేర్కొన్నారు.