ఫేక్ సర్టిఫికెట్లపై దక్షిణ డిస్కం ఫోకస్
ABN , Publish Date - Jul 18 , 2026 | 09:49 AM
ఫేక్ సర్టిఫికెట్‌తో విద్యుత్‌శాఖలో కొందరు ఉద్యోగం పొందారన్న ఆరోపణల నేపథ్యంలో వారి సర్టిఫికెట్ల పరిశీలనపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది.
సర్కిల్ స్థాయిలో ఐదుగురు సభ్యులతో కమిటీ
హైదరాబాద్ సిటీ: ఫేక్ సర్టిఫికెట్‌తో విద్యుత్‌శాఖలో కొందరు ఉద్యోగం పొందారన్న ఆరోపణల నేపథ్యంలో వారి సర్టిఫికెట్ల పరిశీలనపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకుగాను సర్కిల్ స్థాయిలో ఐదుగురు సభ్యులతో కమిటీలు వేసింది. ఈ కమిటీలో డీఈ చైర్మన్‌గా, ఎస్‌ఏఓ, డీఈ (డీపీఈ), ఏపీటీఎస్పీ, కార్పొరేట్ ఆఫీస్ నుంచి అసిస్టెంట్ సెక్రటరీని సభ్యులుగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.
ఈ కమిటీ అన్ని విభాగాల్లో అధికారులు, సిబ్బంది అందజేసిన సర్టిఫికెట్లను మరోసారి పరిశీలించనుంది. కొంతమంది సిబ్బంది పదోన్నతులతో పాటు ఎక్కువకాలం సర్వీసులో కొనసాగేందుకు బర్త్ సర్టిఫికెట్లలో మార్పులు చేశారనే విమర్శలున్నాయి. శివారు సర్కిళ్లలో కొంతమంది నకిలీ ఐటీఐ సర్టిఫికెట్లతో జేఎల్‌ఎంలుగా, ఓ అండ్ ఎం సిబ్బంది డిప్లమా సర్టిఫికెట్లతో సబ్ ఇంజనీర్లుగా, కొంతమంది సబ్‌ఇంజనీర్లు ఏఈలుగా పదోన్నతులు పొందేందుకు నకిలీ సర్టిఫికెట్లు పెట్టారనే ఆరోపణలున్నాయి.
దీంతో క్షేత్రస్థాయిలో మరోసారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నారు. కొంతమంది ఆర్టిజన్లు గ్రేడ్ పెంచుకునేందుకు, మరికొంత మంది సిబ్బంది ఇంక్రిమెంట్ల కోసం, కొంతమంది కుల ధ్రువీకరణ పత్రాలు కూడా నకిలీవి పెట్టారనే ఆరోపణలుండడంతో ఆ సర్టిఫికెట్లను కూడా పూర్తిస్థాయిలో పరిశీలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కారుణ్య నియామకాల్లో సైతం..
దక్షిణ డిస్కం పరిధిలోని 20 సర్కిళ్లలో 12 ఏళ్లలో జరిగిన కారుణ్య నియామకాల్లో సైతం కొంతమంది అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు పొందారనే ఆరోపణలున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎంతమందిని కారుణ్య నియామకాల కింద తీసుకున్నారు.. వారి విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్లు పరిశీలించేలా దక్షిణ డిస్కం చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో నకిలీ సర్టిఫికెట్లతో ప్రయోజనం పొందిన లబ్ధిదారులు వణికిపోతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయ్..
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News