Share News

టాస్క్‌ల పేరుతో దగా..

ABN , Publish Date - Jul 18 , 2026 | 08:38 AM

గ్రేటర్‌ పరిధిలో సైబర్‌ నేరగాళ్లు సరికొత్త మోసాలతో రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్‌ టాస్కులు, రివ్యూల పేరుతో పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు.

టాస్క్‌ల పేరుతో దగా..
Hyderabad cyber fraud

  • నగరంలో రెండు ఘటనల్లో రూ.16.78 లక్షల సైబర్‌ మోసం

  • ఆన్‌లైన్‌ రివ్యూలు, పార్ట్‌టైం ఉద్యోగాలంటూ ఎర

  • సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల దర్యాప్తు

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌ పరిధిలో సైబర్‌ నేరగాళ్లు సరికొత్త మోసాలతో రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్‌ టాస్కులు, రివ్యూల పేరుతో పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ మ్యాజిక్‌ బ్రిక్స్‌ పేరుతో ఒకరు, రాయల్‌ స్పిన్‌ యాప్‌ పేరుతో మరొకరు సైబర్‌ కేటుగాళ్ల చేతిలో చిక్కి, మొత్తంగా రూ.16.78 లక్షలకు పైగా నష్టపోయిన ఉదంతాలు వెలుగుచూశాయి.


మ్యాజిక్‌ బ్రిక్స్‌ పేరుతో ..

ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ మ్యాజిక్‌బ్రిక్స్‌ పేరును దుర్వినియోగం చేస్తూ సైబర్‌ నేరగాళ్లు ఓ ప్రైవేట్‌ ఉద్యోగి నుంచి రూ.12.94 లక్షలు కాజేశారు. ఈ ఘటన సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. హైదర్‌షాకోట్‌కు చెందిన ఎస్‌. రాఘవేందర్‌ అనే ప్రైవేట్‌ ఉద్యోగికి ఈ నెల 4న టెలీగ్రామ్‌లో ‘సౌమ్య ఎం’ పేరుతో ఓ మహిళ సందేశం పంపింది. మ్యాజిక్‌బ్రిక్స్‌ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులను ఆన్‌లైన్‌లో బుకింగ్‌లు, రివ్యూల ద్వారా ప్రచారం చేసి రోజుకు రూ.4500 వరకు సంపాదించవచ్చని, ఏడు రోజుల పాటు పనిచేస్తే రూ.14 వేల ప్రాథమిక వేతనం కూడా ఇస్తామని పేర్కొంటూ ఊబిలోకి దింపింది.


బుక్‌ మ్యాజిక్‌ బ్రిక్స్‌ డాట్‌ కామ్‌ అనే వెబ్‌సైట్‌లో ఖాతా సృష్టించి టాస్కులు పూర్తి చేయాలని సూచించింది. దీంతో బాధితుడు మొదట రూ.8,500జమ చేయగా, రూ. 14వేలు వెనక్కి రావడంతో వారిని నమ్మాడు. ఆ తర్వాత మ్యాజిక్‌బ్రిక్స్‌ పార్ట్‌నర్‌షిప్‌ బోనస్‌ ఆఫర్‌ పేరుతో రూ.లక్ష జమ చేస్తే రూ.75 వేల బోనస్‌ వంటి ఆఫర్లను చూపించి మరింత డబ్బు పెట్టుబడి పెట్టేలా ప్రలోభపెట్టింది. బాధితుడు రూ.లక్ష జమ చేసిన తర్వాత వెబ్‌సైట్‌లో వరుసగా రూ.1,50,157, రూ.3,12,154, రూ.6,32,521 టాప్‌అప్‌ చేయాలని చూపిస్తూ మరిన్ని చెల్లింపులు చేయించారు.


city3.2.jpgచివరకు వెబ్‌సైట్‌లో రూ.17.80లక్షల వర్చువల్‌ లాభం చూపించి, ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోవాలంటే రూ.7.90లక్షల సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అప్పటికే రూ.13,47,767 బదిలీ చేయగా, రూ.67,282 మాత్రమే అందిందని, రూ.12,94,832 మేర నష్టం జరిగినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


రాయల్‌ స్పిన్‌ యాప్‌ పేరుతో..

నకిలీ రాయల్‌ స్పిన్‌ వెబ్‌సైట్‌ ద్వారా పెట్టుబడులు పెట్టించి బాచుపల్లికి చెందిన ఓ యువతి నుంచి రూ.3.84 లక్షలు కాజేసిన సైబర్‌ మోసగాళ్ల ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాచుపల్లిలోని కోలా అనన్యను గతేడాది డిసెంబరు 16న ‘వీఐపీ999-1229-ప్రాపిట్‌’ అనే టెలీగ్రామ్‌ గ్రూప్‌లో చేర్చారు. అనంతరం రాయల్‌ స్పిన్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా కంపెనీ ఉత్పత్తుల ప్రచారం కోసం టాస్క్‌లు పూర్తిచేస్తే మంచి ఆదాయం వస్తుందని నమ్మించారు. లింక్‌ పంపించి తొలుత రూ.3వేలు పెట్టుబడి పెట్టించి, మొదట చిన్న మొత్తాలు ఉపసంహరించుకునే అవకాశం కల్పించారు.


ఐదోరోజు సాఫ్ట్‌వేర్‌ సంస్థ నష్టాల్లో ఉందని, టాస్క్‌లు కొనసాగించాలంటే రూ.15వేల పరిహారం చెల్లించాలని చెప్పారు. అలా రూ.13 వేల చొప్పున రెండు విడతల్లో, అనంతరం రూ.29 వేలు, రూ.30వేలు, రూ.69వేలు ఇలా పలుమార్లు వివిధ ఖాతాలకు నగదు బదిలీ చేసింది. అయినప్పటికీ డబ్బు ఉపసంహరణకు అనుమతి ఇవ్వకుండా మరింత చెల్లించాలని ఒత్తిడి చేశారు. మోసపోయానని, మొత్తం రూ.3,84,726 బదిలీ చేసినట్లు గుర్తించి సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయ్..

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 18 , 2026 | 08:38 AM