సమర్థ పాలనకు బలమైన వ్యవస్థలే పునాది: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Jul 18 , 2026 | 11:09 AM
సమర్థవంతమైన పాలనకు బలమైన వ్యవస్థలే పునాదిగా నిలుస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
అమరావతి, జులై 18 (ఆంధ్రజ్యోతి): సమర్థవంతమైన పాలనకు బలమైన వ్యవస్థలే పునాదిగా నిలుస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం గ్రామీణ పాలనలో అమలు చేస్తున్న సుపరిపాలన విధానాలకు నిదర్శనంగా రాష్ట్రంలోని 23 గ్రామ పంచాయతీలు ప్రతిష్ఠాత్మక ISO 9001:2015 సర్టిఫికేషన్ సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ విశిష్ట ఘనత సాధించిన గ్రామ పంచాయతీలను అభినందించారు. ఇందుకోసం అంకితభావంతో పనిచేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో పలు సంస్కరణలను అమలు చేస్తోందని పవన్ కల్యాణ్ తెలిపారు. సిటిజన్ చార్టర్ అమలు, సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, తాగునీటి సదుపాయాల మెరుగుదల, దివ్యాంగులకు అనుకూల వసతులు, సమాచార బోర్డుల ఏర్పాటు, రికార్డుల డిజిటలైజేషన్, శాస్త్రీయ డాక్యుమెంట్ నిర్వహణ, కార్యాలయ పరిశుభ్రత, ఆస్తుల సమర్థ నిర్వహణ, అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు, అంతర్గత ఆడిట్లు, సిబ్బందికి నిరంతర శిక్షణ, క్రమం తప్పని సమీక్షలు వంటి ఉత్తమ పాలనా విధానాలను ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తోందని వివరించారు.
ISO 9001:2015 సర్టిఫికేషన్ కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదని, గ్రామ పంచాయతీల్లో ప్రజాకేంద్రిత, పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన సుపరిపాలనకు ప్రపంచ స్థాయి ప్రమాణమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ గుర్తింపు ద్వారా గ్రామీణ పరిపాలనలో నాణ్యత, సేవల ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 13 వేలకుపైగా గ్రామ పంచాయతీలకు ఈ 23 గ్రామ పంచాయతీలు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ప్రతి గ్రామంలో మరింత నాణ్యమైన సేవలు, సమర్థవంతమైన పరిపాలన అందించే కొత్త ప్రమాణాలకు నాంది పలకాలని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి, సుపరిపాలన రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
విమాన ప్రయాణికులపై భారం పడనివ్వబోం: రామ్మోహన్
పలాస ఘటనలో తప్పు ఎవరూ చేసినా ఉపేక్షించబోం: హోం మంత్రి అనిత
Read Latest AP News And Telangana News And National News
And Telugu News