అసెంబ్లీ సమావేశాలకు అందరూ తప్పకుండా హాజరుకావాలి: కేసీఆర్
ABN , Publish Date - Sep 06 , 2026 | 04:52 PM
అసెంబ్లీ సమావేశాలకు అందరూ తప్పకుండా హాజరుకావాలని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమావేశాలకు అందరూ తప్పకుండా హాజరుకావాలని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు (ఆదివారం) ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ చర్చించారు. ఈ సందర్భంగా గులాబీ బాస్ మాట్లాడారు. శాసనసభలో, మండలిలో జరిగే ప్రతి చర్చలో పాల్గొనాలని ఆదేశించారు. ఎవ్వరు అసెంబ్లీ సమావేశాలను లైట్‌గా తీసుకోవద్దని మార్గనిర్దేశం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు కోపంగా ఉన్నారు..
స్పీకర్ వైఖరిపై బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో చర్చించాలని కేసీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు 15 నుంచి 20 రోజులు నిర్వహించేలా బీఏసీ సమావేశంలో పట్టుబట్టాలని గులాబీ నేతలకు కేసీఆర్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు కోపంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో వందశాతం తాము అధికారంలోకి వస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇది సర్వభ్రష్ఠ ప్రభుత్వమని విమర్శించారు. కాంగ్రెస్ హామీలను చూసి ప్రజలు మోసపోయారని అన్నారు. ప్రజలకు ఎవరెంటో అర్థమైందని చెప్పారు. నదీ జలాల వాటాల విషయంలో అవసరమైతే యుద్ధమేనని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తా..
త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తానని గులాబీ బాస్ తెలిపారు. కాంగ్రెస్ వైఫల్యాలు, సాగు నీటి సమస్యలపై పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. పాదయాత్ర తానే చేయాలా లేక కేటీఆర్ చేయడమా అనే అంశంపై చర్చిస్తున్నట్లు చెప్పారు. ప్రజా సమస్యలే అజెండాగా అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు. పాలమూరు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కోసం లక్షమందితో ఆందోళన చేయాలని నిర్ణయించామని అన్నారు. అవసరమైతే తానే ఆందోళనకు నేతృత్వం వహిస్తానని తెలిపారు. నదీ జలాల వాటా విషయంలోనూ పోరుబాటకు సిద్ధం కావాలని గులాబీ నేతలకు ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా స్థానిక సమస్యలే అజెండాగా ప్రజలతో మమేకం కావాలని కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అనే మొక్కను మొలవనివ్వను: సీఎం రేవంత్‌రెడ్డి
చేయూత సామాజిక భద్రతా పెన్షన్లకు కొత్త మార్గదర్శకాలు
గణేశ్ ఉత్సవాలపై సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు.. నెల రోజుల పాటు విజిబుల్ పోలీసింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News