Share News

కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కెనాల్ ఉందా? దర్యాప్తు చేయాలంటూ కవిత డిమాండ్

ABN , Publish Date - Nov 13 , 2026 | 02:01 PM

సిద్దిపేట పర్యటనలో భాగంగా కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటి మళ్లింపుపై దర్యాప్తు చేయాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. హరీశ్‌రావుపై ఆరోపణలు చేస్తూ, సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కెనాల్ ఉందా? దర్యాప్తు చేయాలంటూ కవిత డిమాండ్
Kalvakuntla Kavitha

సిద్దిపేట, నవంబర్ 13: జిల్లాలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు(టీఆర్‌ఎస్) కవిత పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ ఆఫీస్‌కు కవిత దంపతులు భూమిపూజ చేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటి మళ్లింపుపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కెనాల్ ఉందా? లేదా? అనే విషయాన్ని బీఆర్‌ఎస్ స్పష్టం చేయాలన్నారు. ‘నేను.. నా అఫిడవిట్‌లో చూపినదానికంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా.. ప్రజలకు రాసిస్తా’ అని సవాల్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతితో తనకు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. తప్పులను నిలదీస్తే ఎదురుదాడి చేయడమేంటని ప్రశ్నించారు.


చాలా ఏళ్లు కేసీఆర్, హరీశ్‌రావుకు అవకాశం ఇచ్చారని.. ఇప్పుడు తమకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కవిత కోరారు. ప్రజలు ఆలోచించాలని.. ఇంకెన్ని రోజులు అవినీతి చేసేవారికి అవకాశం ఇస్తారని ప్రశ్నించారు. వెంకటేశ్వర స్వామి గుడి స్థలానికి సంబంధించి ఐదు ఎకరాలను హరీశ్ రావు, ఆయన అనుచరులు కొట్టేశారని ఆరోపించారు. సిద్దిపేటలో హరీశ్ రావును ఓడించి తీరుతామని.. ఆయనను ప్రజా జీవితం నుంచి తరిమివేస్తామని వ్యాఖ్యానించారు. ఈనెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వస్తున్నారని.. హరీశ్ రావుపై చర్యలు తీసుకునే వరకు కాంగ్రెస్ వెంట పడతామని అన్నారు. ‘రాజకీయాలను ప్రక్షాళన చేసుకుందాం.. కొత్తవారికి అవకాశం ఇద్దాం’ అని పిలుపునిచ్చారు.


‘సిద్దిపేట జిల్లా.. నా సొంత జిల్లా’ అని కవిత అన్నారు. ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందాలన్నదే టీఆర్‌ఎస్ లక్ష్యమని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకుని.. తన గురించి మాట్లాడాలని హితవుపలికారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు బీఆర్‌ఎస్ అన్యాయం చేసిందని విమర్శించారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదన్నారు. సిద్దిపేట ప్రజలకు స్వాతంత్ర్యం రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగరవేస్తామని కవిత ధీమా వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

పదేళ్లలో ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ అయినా ఇచ్చారా?.. కేటీఆర్‌పై పొన్నం ఫైర్

రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనపై కేటీఆర్ ఫైర్.. రూ.100 కోట్ల ఖర్చుపై ప్రశ్నలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 13 , 2026 | 02:07 PM