Share News

రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనపై కేటీఆర్ ఫైర్.. రూ.100 కోట్ల ఖర్చుపై ప్రశ్నలు

ABN , Publish Date - Nov 13 , 2026 | 10:58 AM

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనపై కేటీఆర్ ఫైర్.. రూ.100 కోట్ల ఖర్చుపై ప్రశ్నలు
Former Minister KTR

హైదరాబాద్, నవంబర్ 13: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. రాహుల్‌కు పలు ప్రశ్నలు సంధించారు. ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. ఉద్యోగాల కోసం పోరాడుతున్న నిరుద్యోగులపై దాడులు చేయించినప్పుడు రాహుల్ ఎక్కడున్నారని నిలదీశారు. మహిళా ప్రజాప్రతినిధుల చీరలు లాగి, అసెంబ్లీ ఎదుటే దాడులు చేసినప్పుడు, రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల బలవన్మరణాలపై మాట్లాడేందుకు సమయం లేదా అంటూ రాహుల్‌‌‌‌పై విరుచుకుపడ్డారు.


కేటీఆర్‌ పోస్ట్..

‘ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఉద్యోగాల కోసం పోరాడుతున్న నిరుద్యోగ విద్యార్థులను పోలీసులతో గొంతు నులిమి, దాడులు చేయించినప్పుడు మీరు ఎక్కడున్నారు రాహుల్ గాంధీ? లగచర్లలో గిరిజన మహిళలను వారి భూముల కోసం పోరాడుతున్నందుకు కొట్టినప్పుడు, దుస్తులు చింపి అవమానించినప్పుడు మీకు చలనం కలగలేదా? హైడ్రా బుల్డోజర్లతో కష్టపడి జీవిస్తున్న తెలంగాణ ప్రజల ఇళ్లను కూల్చివేస్తున్నప్పుడు మీరు ఢిల్లీలో నిద్రపోతున్నారా? కంచ గచ్చిబౌలి హెచ్‌సీయూ భూముల్లో రాత్రికి రాత్రే 10 వేలకు పైగా చెట్లను నరికివేసి, జింకలు, నెమళ్లు సహా విలువైన జీవవైవిధ్యాన్ని ధ్వంసం చేసినప్పుడు.. కేబీఆర్ పార్కును నాశనం చేస్తున్నప్పుడు మీ గొంతు ఎందుకు పెగల్లేదు? రాజ్యాంగబద్ధమైన ప్రక్రియలను అపహాస్యం చేస్తూ, 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకున్నప్పుడు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? మహిళా ప్రజాప్రతినిధుల చీరలు లాగి, అసెంబ్లీ ఎదుటే దాడులు చేసినప్పుడు కనీసం ఒక్క మాటైనా మాట్లాడారా రాహుల్ గాంధీ? రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల బలవన్మరణాలు, అర్ధరాత్రి వేళ జర్నలిస్టుల అరెస్టులు, కార్పొరేట్ అనుకూల విధానాలు, భూకబ్జాలపై మాట్లాడటానికి మీకు సమయం లేదా? మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే బహిరంగంగా అవినీతి గురించి మాట్లాడుతున్నారు. అయినా మీరు నోరు ఎందుకు మెదపడం లేదు? అవసరమైనప్పుడు మౌనం వహించారు.. ఇప్పుడు మాత్రం తెలంగాణ ప్రజల సొమ్ము రూ.100 కోట్లతో ప్రచార ఆర్భాటం కోసం సిగ్గులేకుండా వచ్చారా? రాహుల్ గాంధీ.. తెలంగాణ ప్రజల సొమ్ముతో ఈ ప్రచార పర్యటనలు చేయడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు? తెలంగాణ ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా?’ అంటూ ఎక్స్‌లో కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.


ఇవి కూడా చదవండి...

మోపిదేవి ఆలయంలో నాగులచవితి వేడుకలు.. తరలివస్తున్న భక్తులు

పదేళ్లలో ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ అయినా ఇచ్చారా?.. కేటీఆర్‌పై పొన్నం ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 13 , 2026 | 11:11 AM