Share News

42 రోజులకే నీళ్లు..సీటీలో 3లక్షల కనెక్షన్లకు నీటి కటకట తప్పదా?

ABN , Publish Date - Nov 13 , 2026 | 10:22 AM

హైదరాబాద్‌ మహా నగర దాహార్తి తీరుస్తున్న కీలకమైన సింగూరు, మంజీరా జలాలు త్వరలోనే నిలిచిపోనున్నాయి.

42 రోజులకే నీళ్లు..సీటీలో 3లక్షల కనెక్షన్లకు నీటి కటకట తప్పదా?
Hyderabad Water Crisis

  • త్వరలో నిలిచిపోనున్న సింగూరు, మంజీరా జలాల సరఫరా

  • అక్టోబరులోనూ కురవని వర్షాలు

  • శేరిలింగంపల్లితో పాటు ఆరు నియోజకవర్గాలపై ప్రభావం

  • వాటర్‌బోర్డు ప్రత్యామ్నాయ చర్యలు ఫలించేనా?

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ మహా నగర దాహార్తి తీరుస్తున్న కీలకమైన సింగూరు, మంజీరా జలాలు త్వరలోనే నిలిచిపోనున్నాయి. ప్రస్తుతమున్న జలాలు మరో 42 రోజులకు మాత్రమే సరిపోనున్నాయి. వర్షాలు కురవక, వరద రాక సింగూరు జలాశయం నీటిమట్టం పెరగలేదు. ఇక నవంబరు నెలలో వర్షాలు వస్తాయనే ఆశలు సైతం సన్నగిల్లాయి. దీంతో సింగూరు జలాశయం పూర్తిగా డెడ్‌ స్టోరేజ్‌కి చేరనుంది. డిసెంబర్‌ నెలాఖరుకు నగరానికి నీటి సరఫరా ఆగనుంది. అదే జరిగితే హైదరాబాద్‌ మహా నగరంలోని 14 లక్షల కనెక్షన్లలో 3లక్షల నల్లా కనెక్షన్లకు నీటి కట కట తప్పదు. ఓటర్ల సంఖ్య పరంగా దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్న శేరిలింగంపల్లిలోకి నీటి విషయంలో గడ్డు పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.


అయితే ప్రత్యామ్నాయంగా కృష్ణా, గోదావరి జలాలను అందించేందుకు వాటర్‌బోర్డు ప్రయత్నిస్తోంది. నేషనల్‌ డ్యామ్‌ సెక్యూరిటీ సూచనల మేరకు ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయంతో సింగూరు జలాశయంలో నీటి మట్టాలను తగ్గించారు. దాదాపుగా 30టీఎంసీల నీటిని కిందకు గతేడాది వదిలేశారు. సింగూరు జలాశయం డ్యామ్‌, గేట్లు తదితర వాటిని నిపుణులతో పరిశీలించారు. సింగూరు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 523మీటర్లు కాగా, ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం 513.320 మీటర్లు నీళ్లు ఉన్నాయి. నీటి మట్టాలు 516 మీటర్లకు చేరినప్పటి నుంచి గ్రావిటీ ద్వారా వచ్చే జలాలు పంపుహౌజ్‌కు నిలిచిపోయాయి. రెండు నెలలుగా అత్యవసర పంపింగ్‌ ద్వారా నగరానికి సింగూరు జలాలను తీసుకొస్తున్నారు. 510 మీటర్లకు చేరగానే నగరానికి సింగూరు జలాలు దాదాపు 300మిలియన్‌ లీటర్లు నిలిచిపోనున్నాయి.


మంజీరా నిలిచిపోతే వీరికి ఇక్కట్లు తప్పవు!

ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌నగర్‌, యూసు్‌ఫగూడ, బోరబండ, అమీర్‌పేట్‌, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, మూసాపేట్‌, జగద్గిరిగుట్ట, ఆర్సీపురం, అశోక్‌నగర్‌, జ్యోతి నగర్‌, లింగంపల్లి, చందానగర్‌, గంగారం, మదీనాగూడ, మియాపూర్‌, దీప్తిశ్రీనగర్‌, బీరంగూడ, అమీన్‌పూర్‌, నిజాంపేట్‌లతో పాటు పలు ప్రాంతాలకు మంజీరా ఫేజ్‌-1, ఫేజ్‌-2 జలాలు సరఫరా అవుతున్నాయి. ఆ జలాలు నిలిచిపోతే ఆ ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు తలెత్తనున్నాయి.


ప్రత్యామ్నాయ చర్యలు ఫలించేనా?

నగరానికి సింగూరు జలాలు నిలిచిపోయే అవకాశాలుండడంతో వాటర్‌బోర్డు అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. కృష్ణా జలాలను ప్రస్తుతం సైనిక్‌పురి వరకు అందిస్తుండగా, ఆ తర్వాత ప్రాంతాలకు గోదావరి జలాలు అందుతున్నాయి. ఆ ప్రాంతాలకు గోదావరి జలాలను నిలిపివేసి కృష్ణా జలాలు సరఫరా చేయడానికి చర్యలు చేపట్టారు. సింగూరు, మంజీర నీళ్లు సరఫరా జరిగే ప్రాంతాలకు గోదావరి జలాలను మళ్లించనున్నారు. ఇందుకోసం వివిధ ప్రాంతాల్లో వాల్వ్‌లను ఏర్పాటు చేయనున్నారు. కొండాపూర్‌ తదితర ప్రాంతాల్లో వాల్వ్‌లను బిగించడం ద్వారా నీళ్లు సింగూరు పైపులైన్లలో వెనక్కి పోకుండా చర్యలు చేపడుతున్నారు. ఖాజాగూడ జంక్షన్‌ వద్ద కృష్ణా, గోదావరి పైపులైన్లను అనుసంధానం చేశారు. ప్రస్తుతం తట్టిఖానా రిజర్వాయర్‌కు సింగూరు జలాలు అందుతుండగా, దీనికి ప్రశాసన్‌నగర్‌ నుంచి కృష్ణా జలాలు తరలించడానికి చర్యలు చేపట్టారు. ఏ జలవనరైనా షట్‌డౌన్‌ అయితే.. మరో వనరు నుంచి ప్రత్యామ్నాయంగా నీటిని సరఫరా చేసేలా వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నారు. వాటర్‌బోర్డు చేపడుతున్న చర్యలు ఏ మేరకు ఫలిస్తాయనేది వేచిచూడాలి.


city5.2.jpgవర్షాలు, వరద రాలేదు

సాధారణంగా అక్టోబరు నెలలో వర్షాలు కురుస్తాయని వాటర్‌బోర్డు అధికారులు అంచనా వేసుకున్నారు. సింగూరు జలాశయం ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాలతో వరద రావడం వల్ల రెండు, మూడు మీటర్ల మేర నీళ్లు పెరిగినా వేసవిని గట్టెక్కించవచ్చని అనుకున్నారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. సింగూరు జలాశయం ఎగువన వర్షాలు కురవలేదు. వరదలు రాలేదు. తుఫానులు వచ్చినా ఆ ప్రభావం చూపలేదు. ఇక ఎల్‌నినో నేపథ్యంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పగటివేళలో ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయి. రాత్రివేళలో కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. దాంతో నవంబరు నెలలోనూ సింగూరు జలాశయం ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయనే ఆశలు సైతం ఆవిరవుతున్నాయి.


శేరిలింగంపల్లిపై అధిక ప్రభావం

సింగూరు, మంజీరా జలాలను రోజూ నాలుగు ఫేజ్‌ల్లో నగరానికి 300 మిలియన్‌ లీటర్లను తరలిస్తున్నారు. ఏడు నియోజకవర్గాల్లోని వివిధ ప్రాంతాలకు ఆ నీళ్లు సరఫరా అవుతున్నాయి. అవి నిలిచిపోతే శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి, సనత్‌నగర్‌, రాజేంద్రనగర్‌, ఖైరతాబాద్‌ నియోజకవర్గాల్లోని 3 లక్షల నీటి కనెక్షన్లపై ప్రభావం చూపనుంది. ఇందులో శేరిలింగంపల్లి నియోజకవర్గంపై మరింత ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది.


సింగూరు నిలిచిపోతే..

సింగూరు ఫేజ్‌-3, ఫేజ్‌-4 నిలిచిపోతే మలేషియన్‌ టౌన్‌షి్‌ప, మాదాపూర్‌, కొండాపూర్‌, డోయెన్స్‌ సెక్షన్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ), భరత్‌ నగర్‌, మూసాపేట సెక్షన్‌, గాయత్రీ నగర్‌ సెక్షన్‌, బాలానగర్‌ సెక్షన్‌, కేపీహెచ్‌బీ, బాలాజీనగర్‌ సెక్షన్‌ కొంత భాగం, ఫతేనగర్‌, హఫీజ్‌పేట్‌ సెక్షన్‌, మియాపూర్‌ సెక్షన్‌, ప్రగతినగర్‌ సెక్షన్‌, మైటాస్‌, రైల్‌ విహార్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, చందానగర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, మణికొండ, మెహిదీపట్నం, షేక్‌పేట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లోని కొన్ని ప్రాంతాలకు, టోలిచౌకి, భోజగుట్ట, గోల్కొండ పరిసర ప్రాంతాలకు నీటి ఇబ్బందులు తలెత్తనున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ధరలు తగ్గుతూనే ఉన్నాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

ఫ్లాట్లు నిర్మించకుండానే రిజిస్ట్రేషన్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 13 , 2026 | 10:22 AM