గొడ్రాలంటూ వేధిస్తున్న భర్తను హతమార్చిన భార్య.. బెంగళూరులో ఘటన
ABN , Publish Date - Nov 13 , 2026 | 09:31 AM
గొడ్రాలని రోజూ వేధిస్తున్న ఓ భర్తను అతడి భార్య నరికేసింది. తీవ్రంగా గాయపడిన ఆ భర్త మరణించాడు.
ఇంటర్నెట్ డెస్క్: గొడ్రాలని రోజూ వేధిస్తున్న ఓ భర్తను అతడి భార్య నరికేసింది. తీవ్రంగా గాయపడిన ఆ భర్త మరణించాడు. బెంగళూరులో జరిగిందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ నగరంలోని కెంపేగౌడనగర్‌లో రాజశేఖర్, మాలాశ్రీ కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. వీరికి వివాహమై ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగలేదు. ఈ విషయంలో దంపతులిద్దరూ అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు మద్యానికి బానిసైన రాజశేఖర్ ప్రతిరోజూ తాగి ఇంటికి వచ్చేవాడు. భార్యను గొడ్రాలని తిడుతూ వేధించేవాడు. దీంతో రాజశేఖర్, మాలాశ్రీ మధ్య గొడవలు జరిగేవి. గత బుధవారం కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. మద్యం తాగి వచ్చిన భర్త.. భార్యను గొడ్రాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. మెల్లగా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో వంటగది నుంచి కత్తి తీసుకువచ్చిన మాలాశ్రీ.. రాజశేఖర్‌పై దాడి చేసింది. ఆగ్రహంలో ఇష్టానుసారం నరికేసింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న రాజశేఖర్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించాడని వైద్యులు వెల్లడించారు. నిందితురాలు మాలాశ్రీని పోలీసులు అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేపట్టారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.
ఈ వార్తలూ చదవండి
అధికారం పోయినా ఆ మత్తులోనే ఉన్నారు
ఆరేళ్ల తరువాత ‘హతురాలు’ ప్రత్యక్షం