అధికారం పోయినా ఆ మత్తులోనే ఉన్నారు
ABN , Publish Date - Nov 13 , 2026 | 03:04 AM
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ రాజ్యాంగ ప్రతిని పట్టుకొని తిరగటంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ, ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు
ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ రాజ్యాంగ ప్రతిని పట్టుకొని తిరగటంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్‌గాంధీ పేరును ప్రస్తావించకుండానే ఆయనపై సెటైర్లు వేశారు. ఒక జాతీయ వార్తా సంస్థ గురువారం నిర్వహించిన ‘కిసాన్ తక్ భారత్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్’లో మోదీ మాట్లాడారు. ‘ఈ మధ్యకాలంలో కొందరు తమ జేబుల్లో నుంచి తరచూ రాజ్యాంగ ప్రతులను తీసి చూపిస్తున్నారు. అలా రాజ్యాంగం, ప్రజాస్వామ్యం వారి జేబుల్లోనే ఉన్నాయని వారు భావిస్తున్నారు. అధికారంలో లేకపోయినా అదే అధికార మత్తులో ఉంటున్నారు. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఒక విషయాన్ని గుర్తుచేస్తాను. అప్పుడు ఆర్థిక ప్రగతి పనితనంలో గుజరాత్ దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది. ఈ విషయాన్ని ఒక మాజీ ప్రధానమంత్రి పేరుతో ఉన్న సంస్థే అధ్యయనం చేసి చెప్పింది. కానీ, ఆ సంస్థ రిపోర్టును ప్రచురించటానికి నాటి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. రిపోర్టును మార్చాలని పరిశోధకులపై ఒత్తిడి తెచ్చింది. ఈ అధికార అహం వారికి చాలాకాలంగా ఉంది’ అని విమర్శించారు. భూమాతను రక్షించుకోవాలంటే రైతులు ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి.. ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.