ఆకట్టుకున్న ఎగ్జిబిషన్
ABN , Publish Date - Nov 13 , 2026 | 05:00 AM
విశాఖ వేదికగా ప్రారంభమైన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఉత్పత్తులు ప్రదర్శించిన రాష్ట్రంలోని అనేక కంపెనీలు
విశాఖపట్నం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): విశాఖ వేదికగా ప్రారంభమైన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలు కంపెనీలు, స్టార్టప్ సంస్థలు తమ ఉత్పత్తుల ప్రదర్శనతో పారిశ్రామికవేత్తలను ఆకర్షించే ప్రయత్నం చేశాయి. పలు సంస్థలకు చెందిన స్టాల్స్‌లో ఏర్పాటు చేసిన ఉత్పత్తులు, వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం...
విద్యార్థుల కోసం కివి రోబో
విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీకి చెందిన రోబో కప్లర్ ఇండస్ర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ విభిన్న అవసరాలకు అనుగుణంగా రోబోలను తయారుచేస్తోంది. ఈ సంస్థకు ప్రవీణ్ మళ్ల వ్యవస్థాపక సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 2010లో ప్రారంభించిన ఈ కంపెనీ భారత్‌లోనే తొలి హ్యూమనాయిడ్ రోబో మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీగా గుర్తింపు దక్కించుకుంది.
ఈ సంస్థ ఇప్పటివరకూ 300కు పైగా రోబోలను తయారుచేసింది. రైల్వే అవసరాల నిమిత్తం డిజైన్ చేసిన రోబోలు మంచి గుర్తింపు దక్కించుకున్నాయి. విద్యారంగానికి అనుగుణంగా డిజైన్ చేసిన కివి (కైనటిక్ ఇంటర్‌ఫేస్ ఫర్ వైర్‌లెస్ ఇంటరాక్షన్) రోబోను స్టాల్‌లో ప్రదర్శించారు. విద్యార్థుల్లో రోబోటిక్ నైపుణ్యాలను పెంపొందించేందుకు దీన్ని రూపొందించామని ప్రవీణ్ తెలిపారు.
రాప్స్ స్టాల్‌లో ‘రమేశ్ ఏరోస్పేస్’ ఉత్పత్తులు
కృష్ణా జిల్లా గన్నవరం కేంద్రంగా నిర్వహిస్తున్న రమేశ్ ఏరోస్పేస్ అండ్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ తమ ఉత్పత్తులను రాప్స్ పేరుతో ఏర్పాటు చేసిన స్టాల్‌లో పెట్టింది. ఈ సంస్థ 2019 నుంచి డీఆర్‌డీవో, ఇస్రోతోపాటు ఇజ్రాయెల్, ఫ్రాన్స్ వంటి దేశాలకు మిస్సైల్స్, సబ్ సిస్టమ్స్‌ను డిజైన్ చేసి అందిస్తోంది. ఇప్పటివరకు ఇస్రో, డీఆర్‌డీవో చేపట్టిన 30 ప్రాజెక్టుల్లో కీలక ఉత్పత్తులు అందించామని ఆ సంస్థ ఫౌండర్ అండ్ సీఈవో రమేశ్ బాబు తెలిపారు. అదానీ, ఆదిత్య, ఐకామ్ వంటి సంస్థలకు కూడా ఉత్పత్తులు అందించామన్నారు. తమ సామర్థ్యాన్ని ఎక్కువ మందికి తెలియజేసే ఉద్దేశంతో ఈ స్టాల్ ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు.
విదేశాలకు యూబీఆర్ ఫార్మ్ ఫ్రెష్ ఫ్రోజెన్ ఫుడ్
తిరుపతి దగ్గరలోని పూతలపట్టు కేంద్రంగా నడుస్తున్న యూబీఆర్ ఫార్మ్ ఫ్రెష్ ఎల్‌ఎల్‌పీ సంస్థ ఎగ్జిబిషన్‌లో తమ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ అరటి, బొప్పాయి, మామిడి, పైనాపిల్ వంటి సుమారు 40 రకాల పండ్లను ఫ్రోజెన్ ఫుడ్‌గా అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తోంది. స్థానిక రైతుల నుంచి పండ్లను కొనుగోలు చేసి ఫ్రీజింగ్ పద్ధతిలో నిల్వచేసి విదేశాలకు పంపుతోంది.
దీనికోసం సుమారు రూ.30 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేసినట్టు యూబీఆర్ ఫార్మ్ డైరెక్టర్ మోహన్ వెల్లడించారు. విదేశాలకు ఎగుమతి చేస్తున్న ఉత్పత్తులను ఈ స్టాల్‌లో ప్రదర్శించారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన సందర్శకులకు తమ ఉత్పత్తులు, వాటి కాల పరిమితి, ఇతర వివరాలు తెలియజేశారు.
కోకో మిషన్ ఏర్పాటు చేస్తాం: మోండెలేజ్
కోకో రైతులకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఏపీలో కోకో మిషన్ ఏర్పాటు చేయనున్నట్టు ‘మోండెలేజ్ ఇండియా’ వెల్లడించింది. గ్లోబల్ స్నాకింగ్ దిగ్గజం మోండెలేజ్ ఇండియా అధ్యక్షుడు సమీర్ జైన్ నేతృత్వంలో ఒక బృందం సీఐఐ సదస్సు ప్రాంగణంలో సీఎం చంద్రబాబును కలిసింది.
శ్రీసిటీలో రూ.1,800 కోట్లతో చాక్లెట్ యూనిట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే పనులు జరుగుతున్నాయని, అవి పూర్తయితే ప్రపంచంలోనే అతి పెద్ద చాక్లెట్ తయారీ కేంద్రంగా మారుతుందని సమీర్ జైన్ వివరించారు. కోకో మిషన్ ఏర్పాటుకు సహకరించాలని సీఎం కోరగా ఆయన అంగీకరించారు. ఏటా పదివేల హెక్టార్లలో కోకో సాగును విస్తరించి, 2040 నాటికి 50వేల టన్నులకు చేరుస్తామని సీఎం వివరించారు.
‘రెన్యూ’ 80 వేల కోట్ల పెట్టుబడులు
డిజిటల్ మౌలిక సదుపాయాలు, స్వచ్ఛ ఇంధన తయారీ రంగాల్లో ప్రముఖ సంస్థ రెన్యూ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్‌లో సుమారు రూ.80 వేల కోట్ల పెట్టుబడులు ప్రకటించింది. విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమక్షంలో గురువారం ప్రభుత్వానికి, రెన్యూకు ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా రెన్యూ వ్యవస్థాపకుడు, చైర్మన్, సీఈవో సుమంత్ సిన్హా మాట్లాడుతూ, భారత పారిశ్రామిక, డిజిటల్ వృద్ధికి ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారిందన్నారు.
‘క్లీన్ మ్యాక్స్’ పెట్టుబడులు 36 వేల కోట్లు
రాష్ట్రంలో రూ.36వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ పంపిణీ, పంప్డ్ స్టోరేజ్, డేటా సెంటర్ పార్క్ ఏర్పాటుకు ‘క్లీన్ మ్యాక్స్’ సంస్థ ముందుకువచ్చింది. సంస్థ సీఎండీ కుల్‌దీప్ జైన్‌తో గురువారం మంత్రి లోకేశ్ భేటీ అయ్యి రాష్ట్రంలో అవకాశాలను వివరించారు.
మంచు మనోజ్ కంపెనీ ఒప్పందం
కొండపల్లి, ఏటికొప్పాక మాదిరి బొమ్మల తయారీ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వంతో సినీనటుడు మంచు మనోజ్‌కు చెందిన సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ‘నమస్తే వరల్డ్’ పేరుతో ఇప్పటికే ఆ సంస్థ రాష్ట్రంలో పలుచోట్ల తయారుచేసే బొమ్మలను దేశ, విదేశాలకు సంస్థ ఎగుమతులు చేస్తోంది. అయితే మరింత ఆధునీకరణ కోసం రూ.40 కోట్లతో విశాఖపట్నం, ఎమ్మిగనూరు (కర్నూలు)ల్లో కొత్తగా యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. ఈ రెండు చోట్ల ఉత్పత్తి ప్రారంభం తరువాత 950 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ఒప్పందం కార్యక్రమానికి మంచు మనోజ్‌తో పాటు ఆయన భార్య మౌనిక హాజరయ్యారు.
ఆర్చియన్ కెమికల్స్ 3 వేల కోట్ల పెట్టుబడి
ఆర్చియన్ కెమికల్ ఇండస్ర్టీస్ రాష్ట్రంలో రూ.3వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకువచ్చింది. సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా ఆ కంపెనీ సీఈవో అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రామ్ ప్రవీణ్ స్వామినాథన్‌తో రాష్ట్ర మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. జింక్-బ్రోమైడ్ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్వామినాథన్ సూత్రపాయంగా అంగీకరించారు. దీనిద్వారా 1000 ఉద్యోగాలు లభించనున్నాయి. ప్రాజెక్టు గ్రౌండింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని లోకేశ్ చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం
ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు