రెండో రోజు కొనసాగనున్న సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్.. పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు..
ABN , Publish Date - Nov 13 , 2026 | 09:12 AM
విశాఖ వేదికగా జరుగుతున్న సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ రెండో రోజు కీలక సమావేశాలు, పెట్టుబడుల ఒప్పందాలతో సాగనుంది. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడం, వివిధ రంగాల్లో పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలను విస్తరించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువురు పారిశ్రామికవేత్తలు, కేంద్ర మంత్రులు, విదేశీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.
విశాఖపట్నం: విశాఖ వేదికగా జరుగుతున్న సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ రెండో రోజు కీలక సమావేశాలు, పెట్టుబడుల ఒప్పందాలతో సాగనుంది. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడం, వివిధ రంగాల్లో పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలను విస్తరించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువురు పారిశ్రామికవేత్తలు, కేంద్ర మంత్రులు, విదేశీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తొలుత శనివారం ఉదయం 10 గంటలకు వివిధ కంపెనీలతో జరిగే అవగాహన ఒప్పందాల (MoU) కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.
అనంతరం ప్రముఖ జర్నలిస్టు పాల్కీ శర్మ నిర్వహించే ఫైర్‌సైడ్ చాట్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ కానున్నారు. అలాగే స్లోవాక్ రిపబ్లిక్ ఆర్థిక మంత్రి లాడిస్లావ్ కమెనికీ, గ్వాటెమాలా విదేశాంగ మంత్రి జూలియో ఎడురాడోతోనూ సీఎం సమావేశం కానున్నారు. మరోవైపు, అంతరిక్ష రంగంలో పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలపై నిర్వహించే ప్రత్యేక సమావేశంలో స్కైరూట్, హాథర్ రాకెట్స్, అగ్నికుల్, బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ సంస్థల సీఈఓలు ఆయనతో చర్చించనున్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు సమావేశమై ఏపీలో చేపట్టాల్సిన వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై చర్చిస్తారు. ఇక సాయంత్రం 4 గంటలకు జరిగే సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. కాగా, ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
మున్సిపల్ శాఖ ద్వారా రూ.8,460 కోట్ల పెట్టుబడులు
పార్టనర్షిప్ సమ్మిట్ రెండో రోజు రాష్ట్ర మున్సిపల్ శాఖ కూడా కీలక పెట్టుబడుల ఒప్పందాలకు సిద్ధమైంది. మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖ పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకోనుంది. ఈ ఏడాది పార్టనర్షిప్ సమ్మిట్ ద్వారా ఆ శాఖ మొత్తం 18 అవగాహన ఒప్పందాల ద్వారా రూ.8,460 కోట్ల పెట్టుబడులను ఆకర్షించనుంది. తద్వారా 12,735 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే ప్రాంతీయ పెట్టుబడుల సదస్సుల ద్వారా 15 ఒప్పందాలను కుదుర్చుకుంది. తాజాగా రెండో రోజు ఒబెరాయ్ హోటల్స్, నారాయణ హృదయాలయ, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) సంస్థలతో మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ అధికారులు ఒప్పందాలు చేసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణతో పాటు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ కూడా పాల్గొననున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
విమానాశ్రయాలతో ఆర్థిక ప్రగతి: జీఎంఆర్
పారిశ్రామిక క్లస్టర్ ఏర్పాటుకు జపాన్ ఆసక్తి