ఫ్లాట్లు నిర్మించకుండానే రిజిస్ట్రేషన్లు
ABN , Publish Date - Nov 13 , 2026 | 08:31 AM
ఫ్లాట్లు నిర్మించకుండానే ఓ నిర్మాణ సంస్థ వాటిని కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపిస్తూ బాధితులు సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులను ఆశ్రయించారు.
95 మంది నుంచి రూ.50 కోట్లు వసూలు చేసిన నిర్మాణ సంస్థ
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ సమీపంలో ‘సింహా త్రిలోక్’ ప్రాజెక్టు
ఇద్దరు డైరెక్టర్లపై ఈవోడబ్ల్యూ కేసు నమోదు
హైదరాబాద్ సిటీ: ఫ్లాట్లు నిర్మించకుండానే ఓ నిర్మాణ సంస్థ వాటిని కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపిస్తూ బాధితులు సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులను ఆశ్రయించారు. సంగారెడ్డి జిల్లా వెలిమెల, తెల్లాపూర్ సమీపంలో ‘సింహా త్రిలోక్’ ప్రాజెక్టు పేరుతో సుమారు 95 మందికి పైగా కొనుగోలుదారుల నుంచి రూ.50 కోట్ల వరకు వసూలు చేసి, ఆ నిధులను డైరెక్టర్లు ఇతర సంస్థలకు మళ్లించినట్లు బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన అబ్బూరు శ్రీదేవి 2021లో సదరు ప్రాజెక్టులో ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు రూ.40 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు.
అనంతరం నిర్మాణదారులు ఫ్లాట్ విస్తీర్ణం మార్చి అదనంగా రూ.8.95 లక్షలు వసూలు చేశారు. మొత్తం రూ.48.95 లక్షలు చెల్లించగా, 2024 ఫిబ్రవరిలో బ్లాక్-బీలోని ఐదో అంతస్తులో ఫ్లాట్ నంబర్ 512ఏను రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఫ్లాట్ స్వాధీనం చేసినట్లు పేర్కొన్నప్పటికీ, వాస్తవానికి అప్పటికి ఐదో అంతస్తు నిర్మాణమే జరగలేదని బాధితురాలు ఆరోపించారు. ప్రాజెక్టును 2025 అక్టోబరు 22 నాటికి పూర్తి చేస్తామని సంస్థ హామీ ఇచ్చినప్పటికీ గడువు దాటినా పనులు పూర్తికాలేదు.
2026 జూన్ 20న ప్రాజెక్టును ఓ ప్రభుత్వ అధికారి పరిశీలించి, మూడు స్లాబుల నిర్మాణం మాత్రమే పూర్తయిందని గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కంపెనీ ఆర్థిక లావాదేవీల్లోనూ అనుమానాస్పద అంశాలున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు సింహా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దుపాటి శ్రీనివాసరావు, డైరెక్టర్ చెరిపెల్లి శ్రీధర్‌పై కేసు నమోదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ధరలు తగ్గుతూనే ఉన్నాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News