చమురు నౌకపై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం: కేంద్ర మంత్రి సోనోవాల్
ABN , Publish Date - Nov 13 , 2026 | 07:15 AM
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సముద్ర తీరంలో నవంబర్ 11న చమురు రవాణా నౌకపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి నుంచి 19 మంది భారతీయ నావికులు సహా మొత్తం 22 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడినట్లు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు.
న్యూఢిల్లీ, నవంబర్ 13: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సముద్ర తీరంలో నవంబర్ 11న చమురు రవాణా నౌకపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి సమయంలో నౌకలో 19 మంది భారతీయ నావికులతో సహా మొత్తం 22 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే యూఏఈ కోస్ట్ గార్డ్ సిబ్బంది వారందరినీ సురక్షితంగా కాపాడారు. ఈ ఘటనలో భారతీయులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని కేంద్ర నౌకాయాన, పోర్టులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు.
ఈ నెల 11న లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న ముడి చమురు రవాణా నౌక 'ఎంటీ డొమినికా ప్రాస్పెరిటీ' (MT Dominica Prosperity)పై దాడి జరిగింది. యూఏఈలోని మినా సాకర్ పోర్టు సమీపంలో నౌక నిలిచి ఉండగా గుర్తుతెలియని క్షిపణి దాడి చేసింది. దీంతో నౌకలోని ఇంజిన్ గదిలో మంటలు చెలరేగినట్లు బ్రిటిష్ సముద్ర భద్రతా సంస్థలు వెల్లడించాయి. అప్రమత్తమైన యూఏఈ కోస్ట్ గార్డ్ వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. ఘటనాస్థలికి చేరుకుని మొత్తం 22 మంది సిబ్బందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. వీరిలో 19 మంది భారతీయులు ఉన్నారు. తాజాగా ఈ ఘటనపై కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ స్పందించారు. నౌకలోని 19 మంది భారతీయ నావికులంతా క్షేమంగా ఉన్నారని, ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేశారు. సిబ్బంది భద్రత, సంక్షేమం దృష్ట్యా అవసరమైన సహాయ సహకారాల కోసం నౌక నిర్వహణ సంస్థతో భారత ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని ఆయన తెలిపారు.
అలాగే, నవంబర్ 11న సౌదీ అరేబియా జెండాతో ప్రయాణిస్తున్న 'ఎన్సీసీ ఫజర్' (NCC FAJR) నౌక హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తుండగా అనుమానాస్పద దాడికి గురైంది. ఆ నౌకలో ఉన్న ముగ్గురు భారతీయ నావికులతో సహా సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. మరోవైపు, నవంబర్ 10న 'ఎంటీ ఫుజైరా ఎనర్జీ' (MT Fujairah Energy) అనే మరో లైబీరియా జెండా కలిగిన చమురు నౌక పర్షియన్ గల్ఫ్‌లో ప్రయాణిస్తుండగా క్షిపణి దాడికి గురైంది. ఈ ఘటనలో నలుగురు సిబ్బంది గాయపడగా.. వారిలో ఒకరు భారతీయ నావికుడు ఉన్నారని కేంద్రం తెలిపింది. మిగిలిన సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించింది. కాగా, పశ్చిమాసియాలోని పర్షియన్ గల్ఫ్, హోర్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో చమురు రవాణా నౌకలపై కొనసాగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ఎన్విడియా మాజీ సీఈఓ స్థానాన్ని భర్తీ చేయగలిగేది ఆయనొక్కరే: ట్రంప్
ఎన్విడియా సీఈవో జెన్సన్ రాజీనామా